మెదక్ చర్చిలో గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్

మెదక్ చర్చిలో గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్
  • వేలాదిగా తరలివచ్చిన భక్తులు

మెదక్ టౌన్​, వెలుగు : ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్‌‌‌‌ కెథడ్రల్‌‌‌‌చర్చిలో బుధవారం క్రిస్మస్‌‌‌‌సెలబ్రేషన్  అంగరంగా వైభవంగా జరిగాయి. చర్చి నిర్మించి వందేళ్లు పూర్తి కావడంతో శతాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.  ఆనవాయితీ ప్రకారం చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించారు.  తెల్లవారు జామున 4:30 గంటలకు ప్రాతః కాల ఆరాధనతో చర్చిలో క్రిస్మస్‌‌ వేడుకలకు శుభారంభం పలికారు.  

ఇన్ ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ వాక్యాన్ని వినిపించారు.  క్రిస్మస్‌‌‌‌ సందర్భంగా ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సంప్రదాయ పద్ధతిలో పశువుల పాక ఏర్పాటు చేసి దానికి స్టార్‌‌‌‌ వేలాడదీశారు.  మరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్‌‌ ‌‌ట్రీని ఏర్పాటుచేసి దానిని బెల్స్‌‌‌‌, స్టార్స్‌‌‌‌, గ్రీటింగ్‌‌‌‌కార్డ్స్‌‌‌‌ రంగు రంగుల బాల్స్‌‌‌‌తో అందంగా అలంకరించారు.

చర్చిలోని విశాలమైన హాలును రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్‌‌‌‌లు,  స్టార్‌‌‌‌లతో డెకరేట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌, కర్నాటక, మహారాష్ట్రల నుంచి భారీ ఎత్తున భక్తులు మెదక్ చర్చికి తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. 

ఏసు మార్గం అనుసరణీయం

క్రిస్మస్ జరుపుకుంటున్న సమస్త క్రైస్తవ సోదరులకు మెదక్ చర్చి ఇన్‌‌ చార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ మహా దేవాలయంలో ప్రతిష్ట మహోత్సవం జరుపుకుంటున్న అందరం ధన్యులమన్నారు.   దివ్యమైన మహా దేవాలయంలో 1924 డిసెంబర్ 25 న క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయని గుర్తు చేశారు. ఇపుడు వందేళ్ల వేడుకలు జరుగుతుండటం ఎంతో సంతోషకరమన్నారు. ఈ వేడుకల్లో అందరం భాగస్వామ్యం అయినందుకు మన జీవితంలో ఇది ఒక ఒక మైలు రాయి అన్నారు.

ఏసుక్రీస్తు అనుసరించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. సమస్త మానవాళికి ఏసు ప్రభువు ఆశీస్సులు ఉండాలన్నారు. స్వార్థ లోకంలో ప్రతిదీ  నాది అనే ఆలోచనతో ఉంటున్నారని,  ప్రతి ఒక్కరు నిస్వార్ధమైన ప్రార్థనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిబిటరీ ఇంఛార్జి శాంతయ్య, చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్​, గెలెన్​, శాంసన్​ సందీప్​ పాల్గొన్నారు.