
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బంధువుల మృతి
- తట్టుకోలేక తనువు చాలించిన వరుడి తాత
- మెదక్ జిల్లా బాచారంలో విషాదం
పాపన్నపేట, వెలుగు : మరికొద్ది గంటల్లో పెండ్లి ఉందనగా బంధువులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, పెండ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెందిన వరుడి తాత పెండ్లి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేశ్‌కు ఆందోల్‌కు చెందిన అమ్మాయితో మార్చి 28న పెండ్లి నిశ్చయించారు. బుధవారం మధ్యాహ్నం వధువును తీసుకొని రావడానికి కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగువారు, బంధువులతో కలిసి ట్రాక్టర్లో ఆందోల్‌కు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ట్రాక్టర్ బోల్తా పడి రావుగారి భూదమ్మ(50), జెట్టిగారి సంగమ్మ(47) అక్కడికక్కడే చనిపోయారు. వీరితోపాటు మరికొందరు తీవ్రంగా గాయపడగా హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆగమ్మ(50)చనిపోయింది. ఈ ఘటనతో ఊరంతా విషాదంలో మునిగింది. గ్రామస్తులందరూ కొంతమంది డెడ్ బాడీల దగ్గర మరికొంతమంది గాయాలైన వారి వద్ద ఉన్నారు. బంధువులు చనిపోయారని, మనవడి పెండ్లి ఆగిందని మనస్తాపానికి గురైన పెండ్లి కొడుకు రమేశ్ తాత పెంటయ్య(66) గురువారం తెల్లవారు జామున బాత్రూంలో ఉరేసుకొని చనిపోయాడు.
ఒకేసారి నలుగురి అంతక్రియలు
చనిపోయిన ముగ్గురు మహిళలు, పెండ్లి ఆగిపోయిందని ఉరేసుకున్న పెంటయ్య అంతక్రియలు గురువారం బాచారంలో నిర్వహించారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ చందన, జిల్లా కాంగ్రెస్ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పాపన్నపేట ఎంపీటీసీ శ్రీనివాస్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మండల అధ్యక్షులు గోవింద్ సంతాపం వ్యక్తం చేశారు
గత నెలలో ముగ్గురు యువకులు మృతి
గత నెల 20న స్నేహితుడి ఎంగేజ్మెంట్ కు వెళ్లి వస్తూ గడ్డి పెద్దాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాచారానికి చెందిన అల్లాదుర్గం శ్రీకాంత్, గడ్డం ప్రభాకర్, గడ్డం భీమయ్య అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి అదే గ్రామంలో నలుగురు మృతి చెందారు.