భద్రాచలంలో రమణీయంగా గోదాదేవి-రంగనాథుల కల్యాణం..పోటెత్తిన భక్తులు

భద్రాచలం,వెలుగు :   సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భోగి వేళ గోదాదేవి-రంగనాథుల కల్యాణం సోమవారం  వైభవోపేతంగా జరిగింది.   ఉదయం గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చిన అర్చకులు గర్భగుడిలో స్వామికి తిరుమంజనం చేశారు.  మూలవరులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవను చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలకు కూడా ముత్తంగి సేవ జరిగింది.

ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి అక్కడ గోదాదేవి-రంగనాథుల కల్యాణం  ప్రారంభించారు.  సాయంత్రం స్వామికి దర్బారు సేవను చేశారు. దివిటీ సలాం ఇచ్చారు.  దర్బారు సేవ అనంతరం స్వామిని ఊరేగింపుగా తాతగుడి సెంటర్​లోని గోవిందరాజస్వామి ఆలయంలోని గోవింద మండపంకు  తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాపత్​ సేవలో శ్రీసీతారామచంద్రస్వామిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.