
- ఇయ్యాల లింగోద్భవుడికి అభిషేకాలు, శతరుద్రాభిషేకాలు
యాదగిరిగుట్ట, వెలుగు : శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళవారం మూడో రోజు వైభవంగా జరిగాయి. యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధంగా కొండపైన కొలువైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయంలో ఉదయం నిత్య హవనాలు, శివపంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనాలు, మూలమంత్ర జపాలు నిర్వహించారు.
రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో శివపార్వతులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు ధరించిన శివపార్వతులు భక్తులను తన్మయపర్చారు. నూతన వధూవరులుగా ముస్తాబైన ఆదిదంపతుల ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పారాయణికుల వేదపారాయణాలు, రుత్వికుల మూలమంత్ర, మూర్తిమంత్ర జపాల నడుమ, మంగళ వాయిద్య కళతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా కైలాసవాసుడు పార్వతీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే తంతును అర్చకులు నయనానందకరంగా నిర్వహించారు.
నేడు మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం
బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లింగోద్భవునికి అభిషేకాలు, బిల్వార్చన నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ కాలంలో లింగమూర్తికి మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపిస్తారు. అభిషేకం టికెట్ ధర రూ.300, లక్షబిల్వార్చన టికెట్ ధర రూ.516, శతరుద్రాభిషేకం టికెట్ ధర రూ.516 గా నిర్ణయించారు. ఒక టికెట్ పై దంపతులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని గుట్ట ఆలయ అధికారులు తెలిపారు.