
బషీర్‌బాగ్/అంబర్పేట్, వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా నగరం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు శోభాయాత్రలతో సిటీ కాషాయమయమైంది. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వరకు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్‌పేట్ ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబర్‌పేట నుంచి కాచిగూడ వరకు శోభాయాత్రలు నిర్వహించారు. శోభాయాత్రల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 20 వేల పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సీవీ ఆనంద్ కమాండ్కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు.