భద్రాచలం, వెలుగు : భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం తిరుమంగై ఆళ్వార్ పరమ పదోత్సవం వేదోక్తంగా జరిగింది. సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 6 గంటలకు శ్రీరాముడు గోదావరిలో హంసాలంకృత తెప్పపై జల విహారం చేశాడు. ఏటా ముక్కోటి ఏకాదశికి ముందురోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, సోమవారం ఉత్తర ద్వారం నుంచి లక్ష్మణ సమేత సీతారాములు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారం తెరవనున్నారు. 6 గంటల నుంచి స్వామివారు ఉత్తర ద్వారం నుంచి తిరువీధి సేవకు వెళ్తారు.
యాదాద్రిలో మొదటిసారిగా వైకుంఠద్వార దర్శనం
యాదగిరిగుట్ట : వైకుంఠ ఏకాదశి(ముక్కోటి ఏకాదశి) సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి మొట్టమొదటిసారిగా ఉత్తర ద్వారం నుంచి దర్శనమివ్వనున్నారు. ఆదివారం ఉదయం 6:48 గంటలనుంచి 7:30 గంటల వరకు ఈ దర్శనం ఉంటుందని ఈఓ గీతారెడ్డి తెలిపారు. 7:30 నుంచి 8:30 గంటల వరకు ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించనున్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు ముగిసిన తర్వాత అధ్యయనోత్సవాలు మొదలుకానున్నాయి. ఇవి ఈ నెల ఏడో తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ రోజుల్లో ఆర్జిత సేవలను రద్దు చేశారు. సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు కైంకర్యాలు ఉండవు. వెండి మొక్కు జోడు సేవలను సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటలకు నిర్వహించనున్నారు.