యాదగిరిగుట్టలో వైభవంగా తిరుప్పావై వేడుకలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆండాళ్ అమ్మవారికి తిరుప్పావై పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చక బృందం తిరుప్పావై పాశుర పఠనాలు చేసి అమ్మవారికి కట్టెపొంగలి ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదించారు. 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసరావు, ఉమామహేశ్వరి దంపతులు సోమవారం నాలుగు వెండి ప్రమిదలు సమర్పించారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా సోమవారం ఆలయానికి రూ.24,66,376 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.9,31,950, కొండపైకి వెహికల్స్​ ప్రవేశంతో రూ.4 లక్షలు ఇన్ కం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.