- 9 వికెట్ల తేడాతో నమీబియాపై గ్రాండ్ విక్టరీ
- విజృంభించిన ఆడమ్ జంపా
నార్త్ సౌండ్ (అంటింగ్వా): లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (4/12) మ్యాజిక్ చూపెట్టడంతో చిన్న జట్టు నమీబియాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్‌లో సూపర్8 రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించిన కంగారూ టీమ్ 6 పాయింట్లతో ఈ గ్రూప్ నుంచి తర్వాతి రౌండ్ చేరుకుంది.
ఏకపక్షంగా సాగిన ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన నమీబియా 17 ఓవర్లలో 72 రన్స్‌కే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి కెప్టెన్ జెరార్డ్ ఎరాస్మస్ (36) తప్ప మిగతా వాళ్లంతా బ్యాట్లెత్తేశారు. తొలుత ఓపెనర్లు నికొలాస్ డేవిన్ (2), వాన్ లింగెన్ (10)ను హేజిల్‌వుడ్ పెవిలియన్ చేర్చాడు. కమిన్స్ బౌలింగ్స్‌లో జాన్ ఫ్రైలింక్ (1), నేథన్ ఎలీస్ ఓవర్లో జేజే స్మిత్ (3) ఔటవడంతో 18 రన్స్‌కే నమీబియా నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఇక్కడి నుంచి జంపా హవా మొదలైంది. అతని స్పిన్‌ను తట్టుకోలేక జేన్ గ్రీన్ (1), డేవిడ్ వీస్ (1), రూబెన్ ట్రంపెల్‌మన్ (7), బెర్నార్డ్ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ ఎండ్‌లో ఎరాస్మస్ పోరాడుతున్నా.. అతనికి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. బెన్ షికొంగో (0)ను స్టోయినిస్ డకౌట్ చేయడంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే నమీబియా ఇన్నింగ్స్ ముగిసింది.
అనంతరం ఆసీస్ 34 బాల్స్‌లోనే (5.4 ఓవర్లు) 74/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (17 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్), డేవిడ్ వార్నర్ (8 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 20), కెప్టెన్ మిచెల్ మార్ష్ (9 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 18 నాటౌట్) రాణించారు. జంపాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.