
వేములవాడ, వెలుగు : దక్షిణ కాశీ వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరస్వామి రథోత్సవం శనివారం అంగరంగా వైభవంగా సాగింది. పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారల దివ్యకల్యాణం అనంతరం పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఉదయమే స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
ఆలయ స్థానచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ ఆధ్యర్యంలో అర్చకులు రథ ప్రతిష్ఠ, రథ హోమం నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా రంగు రంగుల పూలు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్ పల్లకీ సేవలో పాల్గొన్నారు.