ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ఘనంగా కాళోజీ జయంతి

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ఘనంగా కాళోజీ జయంతి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ప్రజా కవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సోమవారం కాళోజీ 110వ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాళోజీ దేశం కోసం, తెలంగాణ కోసం చేసిన కృషిని కొనియాడారు.

రిజర్వేషన్ల కోసం, లింగ సమానత్వం కోసం ఆయన పోరాడారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ సేవలను గుర్తించి ఆయన పుట్టిన రోజుని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుతుందని తెలిపారు. అలాగే, హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టి గౌరవించుకుందన్నారు. అలాంటి మహనీయుడి స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి తరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది, ఢిల్లీలోని తెలంగాణ వాసులు పాల్గొన్నారు.