
ప్రశాంతతకు నిలయమైన నది.. కలపతో కట్టిన కొన్ని ఇండ్లు. కల్చర్‌ని కాపాడేందుకు రంగురంగుల ట్రెడిషనల్ డ్రెస్‌లు వేసుకున్న ఆడవాళ్లు.. తొంభై ఏండ్లొచ్చినా బైక్‌లు నడిపే వాళ్లని అక్కడ చూడొచ్చు. అలాంటి ప్రదేశం ఒకటుందా? అని డౌట్ వస్తే.. కిహ్ను ఐలాండ్‌కి వెళ్లాల్సిందే. నార్త్ యూరప్‌లో ఉన్న రిపబ్లికన్ దేశం ఎస్తోనియా. ఈ కంట్రీలో దాదాపు రెండు వేల ఐలాండ్లు ఉన్నాయి. వాటిలో ఏడో అతిపెద్ద ఐలాండ్ కిహ్ను. ప్లేస్‌లో పెద్దదైనా కిహ్నులో జనాభా మాత్రం ఏడొందలు. వందల ఏండ్ల నాటి కల్చర్, ట్రెడిషన్‌ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ పాతకాలం నాటి ట్రెడిషనల్ డ్రెస్‌లనే వేసుకుంటారు. ఒకప్పటి చేతివృత్తులే చేస్తున్నారు. 19–20వ శతాబ్దం మొదట్లో కిహ్నులోని చాలామంది మగవాళ్లు నావికులుగా పనిచేసేవాళ్లు. అప్పట్లో వాళ్లంతా ఆ పనిని స్వయంగా నేర్చుకున్నారు. వాళ్లను ‘ఎన్ యుటొయ’ లేదా ‘కిహ్ను జొన్’ అంటారు.
ఆడవాళ్లదే క్రెడిట్
కిహ్ను కల్చర్‌లో భాగమైన హ్యాండీక్రాఫ్ట్స్, డాన్స్, ఆటలు, సంగీతం వంటివి తరువాతి తరానికి నేర్పిస్తారు ఆడవాళ్లు. రోజూ సాయంత్రం యువతులంతా ఒకచోట చేరి హ్యాండీక్రాఫ్ట్స్ తయారుచేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఆడవాళ్లే అక్కడి సంప్రదాయాలను కాపాడుతున్నారు. అంతేకాదు.. అక్కడి ఆడవాళ్లు ఎంత ట్రెడిషనల్‌గా ఉంటారో, అంతే మోడర్న్‌గా ఆలోచిస్తారు. ఉదాహరణకి, పండు ముసలి వయసులో ఉన్న బామ్మలు కూడా సైకిల్, బైక్ రైడింగ్ చేస్తారు. అది కూడా సంప్రదాయ దుస్తుల్లోనే! మోటార్ బైక్‌కు ఒక పక్క చెక్క బాక్స్ పెట్టి ఉంటుంది. అందులో పెంపుడు కుక్కనో లేదా వేరేవాళ్లనో కూర్చోబెట్టుకుని జాలీ రైడ్ చేస్తారు. ట్రాక్టర్ ఇంజిన్స్ ఫిక్స్ చేయడం, చర్చ్ సర్వీస్ వంటి అన్ని పనులూ చేస్తారు అక్కడి ఆడవాళ్లు. ఇలా.. అన్ని పనులూ చక్కబెట్టుకుంటూ వాళ్ల కల్చర్‌ని కాపాడుకుంటున్నారు. అందుకే దీన్ని ‘మాస్టర్‌పీస్ ఆఫ్ ది ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ గా గుర్తించింది యునెస్కో. సింపుల్‌గా చెప్పాలంటే.. సహజ, సాంస్కృతిక సంపదను రక్షిస్తూ, ఒక విధంగా ఎక్కడా చూడని వారసత్వాన్ని కాపాడుతున్న వాటిలో కిహ్ను చాలా గ్రేట్ అని అర్థం.
ఫుడ్ కూడా ట్రెడిషనలే..
కిహ్నులో తినే ఫుడ్ కూడా సంప్రదాయమైనదే. అక్కడ దొరికే ‘రై’ అనే రైస్‌తో చేసిన బ్రెడ్ ఎక్కువగా తింటారు. ఈ బ్రెడ్‌లో గోధుమల కంటే ఫైబర్ ఎక్కువ. దీంతోపాటు ఆలుగడ్డలు, పోర్క్ ఫ్యాట్, బాల్టిక్ హెర్రింగ్ అనే చేపలు తింటారు. ఈల్ చేప సూప్, స్వీట్ మిల్క్ సూప్ తాగుతారు. పెండ్లి విందులో అయితే ఈ ఐటమ్స్ తప్పనిసరి. అలాగే సీల్ అనే జంతువుల్ని వేటాడి, వండుకుని తినడం వీళ్లకి ఒక అలవాటు. ఈ ఐలాండ్‌లో ఉండే మెర్గన్సెర్స్ అనే వాటర్ బర్డ్స్ గుడ్లు కూడా తింటారు. మెర్గన్సెస్ అనేవి ఒక రకమైన బాతులు. వీటి గుడ్లను బ్రెడ్ తయారీలో వాడతారు. ఆ గుడ్లతో రకరకాల వంటలు కూడా చేస్తారు.
మ్యూజియం ముచ్చట్లు
కిహ్నుని స్థానికంగా ‘కిహ్నుమువ’ అని పిలుస్తారు. కానీ.. ఒక్కో భాషలో ఒక్కోలా పిలుస్తారు. కిహ్ను గురించి ఇంకా తెలుసుకోవాలంటే.. కిహ్ను మ్యూజియానికి వెళ్లాలి. అక్కడ చూస్తే ఒక చిన్న ఎస్తోనియన్ ఐలాండ్లా అనిపిస్తుంది. దీన్ని మెయింటెయిన్ చేసేది కూడా ఆడవాళ్లే. విజిటర్స్ కోసం ఏడాది పొడవునా మ్యూజియం తెరిచే ఉంటుంది. ఇందులో ఐలాండ్ చరిత్రకు సంబంధించినవి ఉంటాయి. విజిటర్స్‌కి హ్యాండీ క్రాఫ్ట్స్ కూడా నేర్పిస్తారు ఇక్కడ. కాకపోతే అలా నేర్చుకోవాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. మ్యూజియంతోపాటు మెట్సామా ట్రెడిషనల్ ఫామ్ చూపిస్తారు. అక్కడ ప్రజల రోజూవారీ లైఫ్ స్టైల్, ఐలాండ్‌కి సంబంధించిన పిక్చర్స్ చూడొచ్చు.
కల్చర్ చూడాలంటే..
కల్చర్‌ని ఇష్టపడేవాళ్లు, అక్కడి వాళ్ల ఇండ్లకు, ట్రక్ టూర్స్, ఫిషింగ్ ట్రిప్‌లకు వెళ్లొచ్చు. అక్కడి ట్రెడిషన్‌ని చూడాలంటే వాళ్ల పండుగలప్పుడు అంటే.. చర్చ్ క్యాలెండర్ ప్రకారం.. మిడ్ సమ్మర్ డే, క్రిస్మస్ సీజన్లో సెయింట్ కేథరిన్స్ డే వంటివి జరిగేటప్పుడు వెళ్లాలి. అలాగే మేలో హెర్రింగ్ హైక్, జూన్‌లో హోం కెఫెలు, జులైలో సీ ఫెస్టివల్, ఆగస్టులో డాన్స్ డే, అక్టోబర్‌లో వయొలిన్ డేలను పండుగలుగా చేసుకుంటారు.
ఆటోమెటిక్ పెట్రోల్ స్టేషన్
ఇక్కడ ఏడాది పొడవునా తెరిచి ఉండే కెఫెలు లేవు. కావాలంటే హోం కెఫెలు ఇస్తారు. కాకపోతే వాటిని ముందే బుక్ చేసుకోవాలి. ఐలాండ్‌లో చిన్న హ్యాండీ క్రాఫ్ట్ షాపులు చాలా ఉంటాయి. సమ్మర్లో హార్బర్ మార్కెట్ ఉంటుంది. అక్కడ లోకల్ ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్స్ అమ్ముతారు. కిహ్ను హార్బర్లో ఆటోమెటిక్ పెట్రోల్ స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ ఏటీఎంలు ఉండవు. మరయితే ఎలా? అంటున్నారా.. చాలా స్టోర్స్‌లో కార్డ్ పేమెంట్స్ చేసే వీలుంది.
ఇలా వెళ్లాలి
ఎస్తోనియాలోని టాల్లిన్ ఎయిర్ పోర్ట్ నుంచి కిహ్నుకి కారులో నాలుగ్గంటలు జర్నీ. ఐలాండ్ టూర్లో చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలు చూడొచ్చు. ఐల్యాండ్ టూర్ మొత్తం కలిపి 23 కిలో మీటర్లు జర్నీ. చూడ్డానికి నడిచి లేదా కారులో వెళ్లొచ్చు. లేదంటే ఐల్యాండ్‌లో బైక్‌లను అద్దెకిస్తారు. బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్లొచ్చు.