న్యూఢిల్లీ : ఇండియా గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ మరో ఘనత సాధించాడు. చెస్ ఎలో రేటింగ్‌లో గోల్డ్ స్టాండర్డ్ అయిన 2800 మార్కును దాటాడు. లెజెండరీ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. మొత్తంగా క్లాసికల్ చెస్ రేటింగ్స్ చరిత్రలో 2800 ఎలో రేటింగ్ మార్కును అధిగమించిన 16వ ఆటగాడిగా నిలిచాడని ఫిడే ఆదివారం ప్రకటించింది.
2801 ఎలో రేటింగ్‌తో అర్జున్ ప్రస్తుతం ప్రపంచ నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న తెలంగాణ కుర్రాడు చెస్ ఒలింపియాడ్‌లో ఇండియాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు వ్యక్తిగత బంగారు పతకం కూడా అందుకున్నాడు. 14 ఏండ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించిన అర్జున్ సెప్టెంబర్‌లో ఇండియా నంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచాడు.
వరల్డ్ ర్యాంకింగ్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ 2831 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. ఫాబియానో కరువానా (2805), హికారు నకామురా (2082) టాప్–3లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం డింగ్ లిరెన్‌తో వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరులో తలపడుతున్న గుకేశ్ 2783 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచాడు.