- ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలే కారణం
- హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఘటన
హసన్ పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతో కోడలు, మనవళ్లు కలిసి ఆదివారం ఓ వృద్ధుడిని హత్య చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జల్లి సార య్య(80)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. చిన్నకొడుకు చిన్నప్పుడే చనిపోగా, పెద్దకొడుకు పదేండ్ల కింద అనారోగ్యంతో మరణించాడు. కొంతకాలంగా ఆస్తి విషయంలో పెద్ద కోడలికి అత్తమామలకు గొడవలు జరుగుతున్నాయి.
ఆదివారం ఉదయం ఇంటి నీళ్ల విషయంలో పెద్ద కోడలు జల్లి రమాదేవి అత్తామామలతో గొడవ పడింది. అక్కడే ఉన్న ఆమె కొడుకులు జల్లి సాయికృష్ణ, శశికుమార్ కుర్చీలో కూర్చున్న సారయ్యపై పక్కనే ఉన్న వాకర్ స్టాండ్‌తో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని హసన్ పర్తి సీఐ సురేశ్ తెలిపారు. సారయ్య కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.