హనుమకొండ జిల్లాలో ఇండస్ట్రీల ఇష్టారాజ్యం

  •    పాలిషింగ్ కోసం పెద్దమొత్తంలో కెమికల్స్ వాడకం

  •     వ్యర్థాలన్నీ కాల్వలు, బహిరంగ ప్రదేశాల్లోకి విడుదల

  •     కలుషితమవుతున్న భూగర్భజలాలు

  •     భూసారం తగ్గి దెబ్బతింటున్న పంటలు

  •      ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆఫీసర్లు


హనుమకొండ, ఎల్కతుర్తి, వెలుగు: గ్రానైట్​ కంపెనీలు గ్రామాలపై విషం చిమ్ముతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్​ వాడటమే కాక..  వ్యర్థాలన్నింటినీ కాల్వలు, బహిరంగ ప్రదేశాల్లోకి వదులుతున్నాయి. దీంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. రసాయనాల ప్రభావం పంటపొలాలు, ప్రజారోగ్యంపై పడుతోంది. ఇష్టారీతిన వ్యవహరిస్తున్న గ్రానైట్​ కంపెనీలపై యాక్షన్ తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం  చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది.

నెలకు వేల లీటర్ల కెమికల్స్​..

హనుమకొండ జిల్లాలో 90 గ్రానైట్​ క్వారీలు, దాదాపు 58 గ్రానైట్ కట్టింగ్​, పాలిషింగ్​ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని క్వారీల నుంచి గ్రానైట్​ ముడిరాయిని తీసుకొచ్చి ఎల్కతుర్తి మండలకేంద్రంతో పాటు కాజీపేట మండలం మడికొండ, రాంపూర్​ గ్రామాల మధ్యలో ఏర్పాటైన ఇండస్ట్రీల్లో కట్టింగ్​, పాలిషింగ్​ చేస్తున్నారు. అనంతరం దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాయితో తులిచే క్రమంలో ఆయా ఇండస్ట్రీలు ‘ఎపోక్సీ రైసిన్​’ అనే కెమికల్​ను పెద్ద మొత్తంలో వాడుతున్నాయి. ఆ తరువాత పింక్​, బ్లూ, బ్రౌన్​, బ్లాక్​ ఇలా వివిధ రంగులు ఇమిడేలా మరికొన్ని రసాయనాలు కలిపి పాలిష్​ చేస్తున్నారు. ఇలా ప్రతినెలా సగటున 20 వేల లీటర్లకు పైగా ఎపోక్సి రైసిన్​, వివిధ కలర్లు వచ్చేలా ఇతర కెమికల్స్​ వాడుతున్నట్లు తెలుస్తోంది.

కాల్వలు, బహిరంగ ప్రదేశాల్లోనే వ్యర్థాలు

గ్రానైట్​ కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను సంపుల్లో నిల్వ చేయకుండా బహిరంగ ప్రదేశాల్లోనే వదులుతున్నాయి. ఎల్కతుర్తిలో ఏర్పాటైన ఇండస్ట్రీలు వ్యవసాయ భూములను లీజుకు తీసుకుని, అందులో భారీ గోతులు తవ్వి స్టోర్​ చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు  ట్యాంకర్లలో తరలించి, వాగులు, ఒర్రెల్లో పారబోస్తున్నాయి. ఇక్కడి ఇండస్ట్రీస్​ నుంచి వెలువడిన వ్యర్థాలను ఎల్కతుర్తి, సూరారం, దండేపల్లి మీదుగా శంభునిపల్లి వాగు వరకు పారే ఒర్రెకు ఆనుకునే డంప్​ చేస్తున్నారు. దీంతో అందులో నుంచి వస్తున్న కెమికల్​ వాటర్​ ఒర్రెలో కలిసి నీళ్లన్నీ కలుషితం అవుతున్నాయి. కొద్దిరోజుల కింద సమీపంలోని రైతులు కొందరు సమస్యను ఇండస్ట్రీల ఓనర్ల దృష్టికి తీసుకెళ్లగా.. కెమికల్​ వాటర్​ ఒర్రెలో కలువకుండా ఇసుక సంచులు అడ్డుగా వేసి చేతులు దులుపుకొన్నారు. ఇక రాంపూర్​ లో కొందరు కెమికల్​ వాటర్​ ను నేరుగా డ్రైనేజీలోకి వదులుతున్నారు.

పట్టించుకోని ఆఫీసర్లు

రాష్ట్ర ప్రభుత్వం టీఎస్​ఐపాస్​ ను అమలులోకి తెచ్చిన తర్వాత పరిశ్రమల అనుమతులకు సంబంధించిన రూల్స్​ మారాయి. 2016 నుంచి ఏ ఇండస్ట్రీ అయినా టీఎస్​ఐపాస్​ లో అప్లై చేసుకుంటే ఎలాంటి ఫీల్డ్​ ఎంక్వైరీ లేకుండానే సెల్ఫ్​ సర్టిఫికేషన్​పై రెండు వారాల్లో అనుమతులు ఇచ్చేలా రూల్స్​ మార్చింది. ఈ లెక్కన ఎల్కతుర్తి, రాంపూర్​ వద్ద ఇండస్ట్రీలు ఏర్పాటు కాగా.. వీటి ద్వారా పెద్ద మొత్తంలో కాలుష్యం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.  పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఆఫీసర్లు ఒక్కసారి కూడా ఇటు తొంగిచూసిన దాఖలాలు లేవు.

పంటలు, ఆరోగ్యంపై పెను ప్రభావం

ఎపోక్సి రైసిన్​, ఇతర పాలీఎపోక్సైడ్స్​ లు నీళ్లు, భూమిలో కలిసిపోవడం వల్ల సమీపంలో పంటలు చాలావరకు దెబ్బతింటున్నాయి. ఈ ఇండస్ట్రీల చుట్టుపక్కల ఉన్న పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలు  తొందరగా తెగుళ్ల బారిన పడుతున్నాయి. గతంలో పెద్ద మొత్తంలో దిగుబడి ఇచ్చిన పంటలు ఇప్పుడు ఒక్క కాతకే ఖతమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కెమికల్స్​ వల్ల నీళ్లు కలుషితం అవుతుండటంతో ప్రజలు వివిధ చర్మవ్యాధులు, ఆస్తమా బారిన పడుతున్నారు. పశుపక్ష్యాదులు ఈ కెమికల్​ వాటర్​ తాగి అస్వస్థతకు గురవుతున్నాయి. ఇండస్ట్రీల నుంచి వచ్చే కెమికల్స్​ ను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఆ చుట్టుపక్కల గ్రామాలకు పెనుముప్పు తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇకనైనా  గ్రానైట్‌‌ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు  తీసుకోవాలని, పంటపొలాలు, ప్రజల ఆరోగ్యం దెబ్బతినకముందే  కాలుష్యం నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

చేన్లు కరాబ్​ అయితున్నయ్​

మాకున్న ఎనిమిది ఎకరాల్లో పత్తి పంట వేశాను. ఇదివరకు ఎకరాకు పది క్వింటాళ్ల వరకు పత్తి తీసేవాడిని. కానీ కంపెనీలు పెట్టినప్పటి నుంచి ఘాటు వాసన వస్తోంది. చేన్లు అన్నీ కరాబ్​ అయినయ్​.  ఎకరానికి  ఐదు కింటాళ్లు కూడా రావడం లేదు.  ఏం రోగమో తెలుస్తలేదు.  కంపెనీలకు దూరంగా ఉన్న పొలాలు మాత్రం మంచిగనే ఉన్నయ్​. - అయిత సమ్మయ్య, ఎల్కతుర్తి

కల్లు పారుతలేదు

నేను 30 ఏండ్ల నుంచి తాడి చెట్లు ఎక్కుతున్నా. ఇదివరకు కల్లు మంచిగ అయ్యేది. ఇప్పుడు తాళ్ల చుట్టూ గ్రానైట్​ కంపెనీలు పడ్డయ్​. రెండు, మూడేండ్ల నుంచి కల్లు సక్కగైతలేదు. ఇదివరకు రూ.వెయ్యి కల్లు అమ్మితే.. ఇప్పుడు రూ.500 కల్లు కూడా అయితలేదు.  కంపెనీలకు దూరంగా ఉన్న  చెట్లు మంచిగనే ఉంటున్నయ్​. - గొడిశాల కుమారస్వామి, గీతకార్మికుడు