గ్రౌండ్ వాటర్ తోడేస్తున్న గ్రానైట్ కంపెనీలు

  • జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు
  • ఎండుతున్న బావులు.. నెర్రలు బారుతున్న పొలాలు
  • గ్రానైట్ కంపెనీల పాపమేనంటున్న రైతులు
  • మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి

హనుమకొండ, ఎల్కతుర్తి, వెలుగు: జిల్లాలో గ్రానైట్​ కంపెనీలు గ్రౌండ్​ వాటర్​ ను తోడేస్తున్నాయి. వందల ఫీట్ల వరకు బోర్లు వేయడంతో పాటు 24 గంటల పాటు హైపవర్​ మోటార్లు నడిపిస్తున్నాయి. నిరంతరాయంగా నడుస్తున్న బోర్లతో చుట్టు పక్కల ఉన్న వ్యవసాయ బావుల్లోనూ నీళ్లు ఇంకిపోతున్నాయి. దీంతో బావుల కింద సాగయ్యే ప్రాంతాల్లో  వరి, మొక్కజొన్న, తదితర పంటలు ఎండిపోతున్నాయి. 

ముఖ్యంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, కాజీపేట మండలాల్లోని గ్రానైట్​ కంపెనీలు నిర్విరామంగా నీళ్లు తోడుతుండగా.. చుట్టుపక్కల పొలాలు ఇప్పుడే నెర్రలు బారుతున్నాయి. ఓ వైపు ఎండలు ముదురుతుండటం, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో పొలాలకు నీరు అందడం లేదు.  ఇప్పుడే ఇలా ఉంటే మండు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలల్లో 2.6 మీటర్లు డౌన్​..

హనుమకొండ జిల్లాలో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి.  25 చోట్ల పైజోమీటర్ల ద్వారా అధికారులు గ్రౌండ్​ వాటర్​ లెవల్​ లెక్కిస్తున్నారు.  ఆఫీసర్ల లెక్కల ప్రకారం భూగర్భజలాలు గత జులైలో  సగటున 2.86 మీటర్ల లోతులోనే ఉన్నాయి. గత నవంబర్​ వరకు 4.11 మీటర్ల లోతులో ఉండగా.. ఆ తరువాత నుంచి భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. దీంతో  నిరుడు నవంబర్ తో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు 2.6 మీటర్ల మేర భూగర్భ నీటి మట్టం పడిపోయింది. 

ఫిబ్రవరి చివరి నాటికి జిల్లాలో సగటున 6.74 మీటర్ల లోతులో ఉండగా.. ఏప్రిల్, మే నాటికి మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా   పెద్ద ఎత్తున ఇసుక దందా జరిగే ఐనవోలు మండలంలో గ్రౌండ్​ వాటర్​ 18.50 మీటర్ల లోతుకు చేరగా.. వేలేరు మండలం పీచరలో 16 మీటర్ల లోతులో ఉన్నాయి. భీమదేవరపల్లి మండలం వంగరలో 13.2 మీటర్లు, గట్ల నర్సింగాపూర్​ లో 8.7 మీటర్లు, నడికూడ మండలం చెర్లపల్లిలో 9.75 మీటర్ల లోతుకు చేరాయి.

24 గంటలూ తోడుతున్న కంపెనీలు

గ్రానైట్​ కంపెనీలు ఎక్కువగా రన్​ అవుతున్న ఎల్కతుర్తి, కాజీపేట మండలాల్లో గ్రానైట్​ కంపెనీలు 24 గంటలూ నీటిని తోడుతున్నాయి. ఓ వైపు సాగునీటి వనరులు సరిగా లేక రైతులు బావుల కింద సాగు చేస్తుండగా.. గ్రానైట్​ కంపెనీల పుణ్యమాని గ్రౌండ్ వాటర్ రోజురోజుకూ పాతాళానికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఎల్కతుర్తి మండలంలోని ఎల్కతుర్తి, సూరారం, వల్భాపూర్​ శివారులోని వ్యవసాయ భూముల్లో  40కిపైగా గ్రానైట్​ కంపెనీలు ఏర్పాటు కాగా.. వాటిలో ఒక్కోదాంట్లో రెండు, మూడు బోర్లు వేశారు. 1,500 నుంచి 2 వేల ఫీట్ల వరకు బోర్లు వేసి, గ్రానైట్​ రాళ్ల కట్టింగ్​, పాలిషింగ్​ కోసం 24 గంటల పాటు నీటిని తోడుతున్నారు. రికాం లేకుండా బోర్లు నడిపిస్తున్న కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. 

నీళ్ల కోసం రైతులకు తిప్పలు వాస్తవానికి గ్రానైట్​ కంపెనీల ఏర్పాటు

కు ముందువరకు ఇక్కడ ఏటా రెండు పంటలకు బావుల నుంచే సమృద్ధిగా నీళ్లు లభించేవి. గ్రౌండ్​ వాటర్​ పుష్కలంగా ఉండటంతో ఇక్కడ పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోయేవి. కానీ ఇప్పుడు కంపెనీలు నిరంతరంగా నీటిని తోడుతుండటంతో ఆ ప్రభావం పంటపొలాలపై పడుతోంది. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలకు నీటి లభ్యత తగ్గిపోయి పంటలు ఎండిపోతున్నాయి. ఓ వైపు ఎండలు ముదురుతుండటం, మరోవైపు బావులు కూడా అడుగంటిపోతుండటంతో పొట్ట దశలో ఉన్న వరి, పీచు తోడే దశలో ఉన్న మొక్కజొన్న పంటలు మాడిపోతున్నాయి. 

గతంలో వ్యవసాయ బావుల వద్ద 24 గంటలు రికాం లేకుండా నడిసిన బోర్లు ఇప్పుడు అరగంట కూడా పోయలేని దుస్థితి నెలకొంది. పంటల పొలాలు నీరు లేక బీటలు వారుతుండటంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.

నీళ్ల ట్యాంకర్​ కోసం తిరుగుతున్న

నేను  రెండెకరాల్లో  మిరపతోట పెట్టిన. కానీ  కాతకు  వచ్చే దశలో నీళ్లు సరిగా ఎల్తలేవు.  నీళ్లు లేక మిర్చి పంట అక్కరకు రాకుంట అయ్యింది. నాలుగేండ్ల సంది ఇదే గోస. ఇక్కడ గ్రానైట్ కంపెనీలు పొద్దూ,మాపూ రికాం లేకుండా మోటార్లు నడపడం వల్ల పొలాలకు నీళ్లు లేకుండ పోతున్నయ్. అందుకే పంటను కాపాడుకోడానికి 15 రోజుల నుంచి నీళ్ల ట్యాంకర్​ కోసం తిరుగుతున్న.
-  అయిత సమ్మయ్య, మిర్చి రైతు, ఎల్కతుర్తి

బావుల్లో నీళ్లు ఎల్లుతలేవు

‌‌నాకు ఎనిమిదెకరాల భూమి ఉంటే..  రెండెకరాల్లో వరి, ఐదెకరాల్లో మక్క ఏసిన. మా దగ్గర గ్రానైట్ కంపెనీలు పెట్టినంక ఇక్కడ పంటలు సక్కగ పండుతలేవు. ఈ సీజన్​ కల్లా పుష్కలంగా ఉండాల్సిన నీళ్లు ఇప్పుడే తగ్గుముఖం పట్టినయ్​. నీళ్లు సక్కగ అందక ఎకరం మక్క, రెండెకరాల వరి పంట ఎండింది. నాలుగేండ్ల కిందట మా బాయిలళ్ల నీళ్లు ఒడువక పోయేది. ఈ గ్రానైట్ కంపిన్లు వచ్చినంక నీళ్లు సక్కగ ఉంటనే లేవు.
-  కోదాటి మాధవరావు, రైతు, వల్బాపూర్