మహబూబాబాద్ జిల్లాలో ఆటోపై గ్రానైట్ రాయి పడి.. ఇద్దరు మృతి

మహబూబాబాద్ జిల్లాలో ఆటోపై గ్రానైట్ రాయి పడి.. ఇద్దరు మృతి
  • మరో ఆరుగురికి గాయాలు
  • మహబూబాబాద్ జిల్లా సోమ్ల తండా వద్ద ఘటన

మహబూబాబాద్ జిల్లాలో లారీలో నుంచి గ్రానైట్ రాయి జారి ఆటోపై పడటంతో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రం నుంచి కురవి వైపు ఆటోలో 8 మంది వెళ్తున్న టైమ్​లో.. గ్రానైట్ రాళ్లతో లారీ వచ్చింది. సోమ్ల తండా వద్ద ఆటో, లారీ పక్కపక్కనే పోతుండగా.. గ్రానైట్ బండ లారీ పైనుంచి జారి ఆటోపై పడింది.

మహబూబాబాద్/కురవి, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లారీపై నుంచి గ్రా నైట్ రాయి జారి ఆటోపై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలను మహబూబాబాద్ డీఎస్పీ సదయ్య వెల్లడించారు. శని వారం రాత్రి జిల్లా కేంద్రం నుంచి కురవి వైపు ఆటోలో 8 మంది వెళ్తున్న టైంలో.. అదే దారిలో గ్రానైట్ బండ రాళ్లతో లారీ వచ్చింది.

సోమ్ల తండా వద్ద ఆటో, లారీ పక్కపక్కనే పోతుండగా.. గ్రానైట్ బండ రాయి లారీ నుంచి జారింది. ఆటో వెనుక భా గంలో పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న చిన్నగూడురు మండలం మంగోళిగూడేనికి చెందిన బానోతు సుమన్ (34), శ్రీకాంత్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. డొనికన నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోలో ప్రయాణిస్తున్న లింగంపల్లి రాంబాబు, బానోతు రాము, నునావత్ వీరన్న, బొడ్డు శేఖర్ గాయపడ్డారు. 108 ద్వారా క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

బండరాయి కింద ఇరుక్కున్న మృతదేహాలను భారీ క్రేన్ల సాయంతో బయటికి తీశామని డీఎస్పీ సదయ్య తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన మహబూబాబాద్​ ఎంపీ మాలోతు కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్.. ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.