- - గ్రానైట్స్ లోడ్ లారీల తరలింపులో రూల్స్ బేఖాతర్
- 7 మెట్రిక్ టన్నుల బరువుకు పైగా లారీల్లో తరలింపు
- అంతంతమాత్రంగా ఆఫీసర్ల తనిఖీలు
- దెబ్బతింటున్న బీటీ రోడ్లు, ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
- కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నిబంధనలకు విరుద్ధంగా ప్రతిరోజు వివిధ ఏరియాల నుంచి ఓవర్‌లోడ్ తో లారీల్లో గ్రానైట్ రాళ్లను తరలిస్తున్నారు. మైనింగ్, ట్రాన్స్పోర్ట్, పోలీస్ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, పెద్ద సంఘటనలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతేనే హడావిడి చేస్తున్నారు. ఆయా శాఖల ఆఫీసర్లు నెలవారీ మాముళ్లకు అలవాటుపడి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో..
జిల్లాలో 168 బ్లాక్ గ్రానైట్, 2 కల్లర్ గ్రానైట్, బెరైటీస్, డోలమైట్, క్వర్ట్జ్, స్టోన్ మెటల్ కలిపి మొత్తం 197 క్వారీలకు అనుమతులున్నాయి. జిల్లాలో తొర్రూరు, కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల్లో ఎక్కువగా గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లోనే గ్రానైట్ అక్రమ రవాణా కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు, ఏపీ, చెన్నై, బెంగుళూరుకు గ్రానైట్ లోడ్ లారీలు తరలుతున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఖమ్మంకు 500 వరకు గ్రానైట్ లోడ్ లారీలు వెళ్తుంటాయి.
రూల్స్ బేఖాతర్..
గ్రానైట్ షీట్లను ఒక లారీపై 4 మెట్రిక్ టన్నుల బరువు వరకు మాత్రమే తరలించవలసి ఉండగా, నిర్వాహకులు యథేచ్ఛగా 7 మెట్రిక్ టన్నులకుపైగా గ్రానైట్ షీట్లను ఒకేసారి తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా లారీపై గ్రానైట్ షీట్ లోడ్ చేసిన క్రమంలో ఇనుప గొలుసుతో రక్షణ కల్పించడం, లారీ సైజ్ దాటి రాకుండా చూడటం, వాహనాలు అతివేగంగా వెళ్లకుండా చూసుకోవాలి. నిర్వాహకులు ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
గతంలో జిల్లాలోని కురవి మండలంలో గ్రానైట్ బండరాయి పక్కనే వెళ్తున్న ఆటోపై పడి ముగ్గురు మృత్యువాత పడ్డ ఘటనలో 7 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ బరువును లారీలో తరలిస్తున్నట్లు మైనింగ్ ఆఫీసర్లు గుర్తించారు. ఖమ్మం–వరంగల్హైవేపై నరసింహులపేట మండల సమీపంలో గ్రానైట్లారీ బోల్తాపడిన విషయం తెలిసిందే. భారీ గ్రానైట్ షీట్లు రోడ్డు పై పడితే తొలగించడం కష్టమైంది. పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్ ధ్వంసమై నీటి సరఫరా నిలిచిపోయింది.
ఓవర్ లోడ్‌తో రోడ్లు దెబ్బతింటున్నాయి..
గ్రానైట్ ఓవర్ లోడ్ తో మెట్రిక్ టన్నుల బరువుతో బీటీ రోడ్లపై లారీలు ప్రయాణం కొనసాగించడం ద్వారా రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. కొన్నిచోట్ల కల్వర్టులు, బ్రిడ్జిలు కుంగిపోతున్నాయి. మేచరాజుపల్లి నుంచి ఎర్రబెల్లిగూడెం, కాచికల్, నెల్లికుదరు రహదారి గ్రానైట్ లారీల మూలంగా బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఆఫీసర్లు నిబంధనలు పాటించని గ్రానైట్ లారీలను సీజ్ చేసి, కఠిన చర్యలను తీసుకోవాలి.- వంగాల ఈశ్వర్, ఎర్రబెల్లిగూడెం, నెల్లికుదురు మండలం