తప్పుల తడకగా రేషన్ కార్డుల సర్వే...తహసీల్దార్​కు ఫిర్యాదు

కుంటాల, వెలుగు: కుంటాల మండలంలో రేషన్ కార్డుల మంజూరు వివాదాలకు దారి తీసింది. వివిధ శాఖల అధికారులు గతంలో నిర్వహించిన కుల గణన, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో సమగ్ర కుటుంబ వివరాలు అందించిన తమ పేర్లు రేషన్ కార్డుల మంజూరు జాబితాలో లేవని అర్హులైన పేదలు ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డు లేనివారు గతంలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుంటాల మండలానికి 600లకు పైగా రేషన్ కార్డులు మంజూరైనట్లు సమాచారం. సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు మంజూరైన జాబితాలో అర్హులను గుర్తించే పనిలో భాగంగా సర్వే చేపట్టారు.

అయితే గ్రామాల వారీగా జాబితాను బయటకు రాకుండా గోప్యంగా ఉంచడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డౌనెల్లి గ్రామానికి చెందిన పలువురు జాబితాలో తమ పేర్లు లేవని తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు. రేషన్ కార్డుల మంజూరు ఏ ప్రాతిపదికన జరిగిందనే విష యాన్ని రెవెన్యూ, పంచాయితీ రాజ్ అధికారులు చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈ విషయంపై తహశీల్దార్ ఎజాజ్​ను వివరణ కోరగా రేషన్ కార్డుల మంజురు, లబ్ధిదారుల ఎంపికపై తమకు ఎలాంటి సంబంధం లేదని, పైనుంచి వచ్చిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు.