సిటీలో 70 శాతం అద్దె బిల్డింగుల్లోనే అంగన్ వాడీ సెంటర్లు

  • ప్రభుత్వ ఫండ్స్​ బిల్డింగ్​ రెంటుకు కూడా సరిపోవట్లే
  • సిటీలోని 70 శాతం సెంటర్లు అద్దె బిల్డింగుల్లోనే..
  • పక్కా బిల్డింగులు కట్టించాలని డిమాండ్
  • అదనపు ఖర్చులను తామే భరిస్తున్నామంటున్న టీచర్లు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని అంగన్‌వాడీ సెంటర్లకు ఇచ్చే గ్రాంట్లు సరిపోక, సొంత బిల్డింగులు లేక టీచర్లు నానా అవస్థలు పడుతున్నారు. రెంట్లు కట్టలేక చిన్న చిన్న గదుల్లో, అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు. అధిక శాతం సెంటర్లు అద్దె బిల్డింగుల్లోనే కొనసాగుతున్నాయి. అంగన్​వాడీ సెంటర్లకు పక్కా బిల్డింగ్‌లు నిర్మించి ఇస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోలేదు. దీంతో సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో బిల్డింగులు రెంట్లు పెరిగిపోతున్నాయి. ఏరియాని బట్టి ఒక్కో రూమ్​రెంట్​రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు ఉంటోంది. ప్రభుత్వం ఇస్తున్న ఫండ్స్​కనీసం రెంట్లకు కూడా సరిపోవడం లేదని టీచర్లు వాపోతున్నారు. కరెంట్, వాటర్ మెయింటెనెన్స్, ఇతర ఖర్చులను తమ జేబుల్లో నుంచే పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో కేంద్రానికి రూ.5 వేల లోపే..

హైదరాబాద్​జిల్లాలోని చార్మినార్ , గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో మొత్తంగా 914 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 70 శాతం సెంటర్లు అద్దె బిల్డింగుల్లోనే నడుస్తున్నాయి. మిగతావి కమ్యూనిటీ సెంటర్లలో, ప్రైమరీ స్కూళ్లలో నిర్వహిస్తున్నారు. అయితే అద్దె బిల్డింగుల్లో నిర్వహణ కష్టంగా ఉంటోందని, పక్కా భవనాలు నిర్మించాలని టీచర్లు ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకోవడంలేదని అంగన్‌వాడీ కేంద్రాల రాష్ట్ర యూనియన్ జనరల్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. సిటీలోని అద్దె గదుల్లో కొనసాగుతున్న సెంటర్లకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.5 వేలకు మించి రావడం లేదు. 

ఓనర్ల నుంచి ఒత్తిళ్లు..

మునుపటితో పోలిస్తే ప్రస్తుతం ఏరియాని బట్టి 15 నుంచి 30 శాతం రెంట్లు పెరిగాయి. అంగన్‌వాడీ కేంద్రాలను ఒక రూమ్‌లో నడిపిస్తుంటారు. గతంలో కమ్యూనిటీ సెంటర్లలో ఇవి ఎక్కువగా కొనసాగేవి. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాక అంగన్‌వాడీలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగన్‌వాడీ కేంద్రాలకు కేటాయించిన భూములను లోకల్ లీడర్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు చాలా వరకు అద్దె రూముల్లో నడుస్తున్నాయి. ఈ క్రమంలో రెంటు ఇన్​టైంలో చెల్లించకపోతే బిల్డింగ్ ఓనర్ల నుంచి టీచర్లు ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి వస్తున్న ఫండ్స్ సరిపోక ఓనర్లకు సర్దిచెప్తూ నడిపిస్తున్నామని చాలామంది టీచర్లు వాపోతున్నారు.