హైదరాబాద్, వెలుగు: ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాకు ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన మొదటి క్వార్టర్లో పన్ను తర్వాత లాభం ఏడాది ప్రాతిపదికన దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.135 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ క్వార్టర్లో రూ.48 కోట్ల పన్ను తర్వాత లాభాన్ని (పీఏటీ) ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ. 985 కోట్ల నుంచి రూ. 1,180 కోట్లకు పెరిగిందని హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ క్వార్టర్లో పనితీరును మెరుగుపర్చుకున్నామని, కొన్ని ఒడిదుడుకుల తర్వాత గాడిలో పడ్డామని గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి తెలిపారు. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 4.15 శాతం పెరిగి రూ.587.80 వద్ద ముగిశాయి.