తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గడ్డి, పిచ్చి మొక్కలు

ఇది రామారెడ్డి మండలం సింగరాయిపల్లిలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం. ఈ గ్రౌండ్‌ ఏర్పాటుకు రూ.4.58 లక్షలతో ప్రతిపాదించారు. రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో అందరికీ కనిపించేలా  నాలుగు నెలల కింద బోర్డు ఏర్పాటు చేశారు. వాలీబాల్, ఖోఖో ఆటల కోసం నాలుగు కర్రలు పాతారు.  స్థలాన్ని చదును చేయడం కానీ, ఇతరత్రా ఏమి పనులు జరగలేదు. కంప్లీట్‌గా గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగాయి.   ఇప్పటి వరకు రూ.30వేలకు పైగా ఫండ్స్ ఖర్చయ్యాయి.

కామారెడ్డి , వెలుగు : క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామాలు,  పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల కింద చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి ప్రోగ్రామ్‌‌లో భాగంగా వీటి పనులు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించింది. ప్రభుత్వ స్థలం  అందుబాటులో ఉన్న  చోట వెంటనే పనులు చేపట్టాలని సూచించడంతో గవర్నమెంట్ ​స్థలాలు, స్కూల్ ​గ్రౌండ్స్‌‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పావు ఎకరం నుంచి ఎకరం వరకు స్థలాన్ని  క్రీడా ప్రాంగణం కోసం కేటాయించారు. ఆటలకు అనువుగా స్థలాన్ని చదును చేసి మొరం పోయించడంతో పాటు వాలీబాల్​, ఖోఖో, కబడ్డీ ఆటలకు కోర్టులు ఏర్పాటు చేయాలి. అందరికీ తెలిసేలా బోర్డు బిగించాలి. ఇందు కోసం రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు 
చేయవచ్చు. 

పరిస్థితి ఇదీ...

క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టి ఆరు నెలలు అవుతున్నా చాలా చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. జిల్లాలో 526 పంచాయతీలకుగాను 488 చోట్ల క్రీడా ప్రాంగణాలు శాంక్షన్​ చేశారు. ఇందులో 117 పనులు కంప్లీట్ చేసినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. 

జిల్లాలోని పలు చోట్ల క్రీడా ప్రాంగణాలు కేవలం 

బోర్డులకే పరిమితమయ్యాయి. ఫండ్స్​కొరతతో పనులు ముందుకెళ్లడం లేదు. ఇప్పటి వరకు పనులు జరిగిన చోట కూడా వాలీబాల్, ఖోఖో ఆటల కోసం కర్రలు పాతారు. కొన్ని చోట్ల కొంత మేర మొరం పోసి మైదానాన్ని చదును చేశారు. ఎక్కువ చోట బోర్డు, కర్రలు పాతడంతోనే సరిపోయింది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట,  నిజాంసాగర్​, గాంధారి,  మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, రాజంపేట, తాడ్వాయి , జుక్కల్, మద్నూర్, బిచ్కుంద తదితర మండలాల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రస్తుతం పోలీస్ సెలక్షన్లు జరుగుతున్నాయి. ఆయా గ్రామలకు చెందిన యువకులు పోలీసు కానిస్టేబుల్స్ సెలక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ గ్రౌండ్‌‌లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే  అభ్యరులు ఇక్కడ శిక్షణ పొందేందుకు అవకాశం ఉంటుంది.

ఇది తాడ్వాయి మండలం కరడ్‌‌పల్లిలోని తెలంగాణ 

క్రీడా ప్రాంగణం. దీని ఏర్పాటుకు రూ.3.89  లక్షలతో పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఒక బోర్డుతో పాటు గ్రౌండ్‌‌లో అక్కడక్కడ కొంత మొరం చల్లారు.  మట్టి పనులకు రూ.6,600 వరకు ఖర్చు చేశారు. హైస్కూల్​ఆవరణలోనే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. గేమ్స్‌‌కు సంబంధించిన మిగతా పనులు ఏమీ జరగలేదు.

కంప్లీట్ చేయిస్తాం..

 క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 117 కంప్లీట్ అయ్యాయి. ఫండ్స్ రాకపోవడంతో కొంత డిలే జరిగింది. త్వరలోనే అన్ని కంప్లీట్ అవుతాయి. 

- సాయన్న, డీఆర్డీవో, కామారెడ్డి