కుక్క చచ్చిపోతే సమాధి కట్టి...చికెన్తో భోజనాలు

కుక్క చచ్చిపోతే సమాధి కట్టి...చికెన్తో భోజనాలు

ప్రేమగా పెంచుకున్న శునకం చనిపోతే సమాధి కట్టడంతో పాటు..పెద్ద  కర్మ చేశాడో యజమాని. అంతేకాకుండా దశదిన కర్మకు చికెన్ తో భోజనాలు పెట్టించాడు.  కుక్క విశ్వాసానికి యజమాని కృతజ్ఞత చాటిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

శునకానికి సమాధి ఎక్కడంటే..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన రాచర్ల వీరన్న, మంజుల దంపతులు ఆరేళ్ల క్రితం ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకున్నారు. దానికి జాకీ అని పేరు పెట్టి కన్నబిడ్డలెక్క సాదుకున్నారు. యజమాని ప్రేమకుపొంగిపోయిన జాకీ..వారిపై అమితమైన విశ్వాసాన్ని ప్రదర్శించేది. సొంత బిడ్డ లెక్క అల్లారుముద్దుగా పెంచుకున్న జాకీ..10 రోజుల క్రితం  అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో కన్నీరుమున్నీరైన దంపతులు ..మనుషులకు చేసిన విధంగానే కర్మకాండ నిర్వహించారు. తమ జ్ఞాపకాలను పంచుకునేందుకు యజమాని రాచర్ల వీరన్న, మంజుల దంపతులు జాకీ జ్ఞపకార్థంగా ఇంటికి దగ్గరలోని కుంటకట్ట వద్ద ఖననం చేశారు. అంతేకాదు రూ. 25 వేలు ఖర్చు చేసి సమాధి నిర్మించి జాకీ (కుక్క) ఫోటో ఏర్పాటు చేశారు.

ALSO READ :మొక్కల కోసం తవ్వుతుంటే పొగలు వస్తున్నాయి..వీడియో వైరల్

10వ  రోజు న జాకీ (కుక్క)కి సమాధి వద్ద గంగి రెద్దులతో దశదిన కర్మ నిర్వహించారు.  ఈ సందర్బంగా దశ దిన కర్మరోజు ప్రజలను పిలిచి చికెన్తో భోజనాలు పెట్టారు.  పెంచుకున్న జాకీ (కుక్క ) మృతి చెందితే సమాధి ఏర్పాటు చేసి దశదిన కర్మ చేసి భోజనాలు పెట్టడం పట్ల గ్రామస్తులు హర్హం వ్యక్తం చేశారు.