
- ఇంటెక్‌వెల్ దగ్గర బురద, మట్టి తొలగింపు పనులు
- రూ.35 లక్షలు శాంక్షన్ చేసిన ప్రభుత్వం
- గోదావరిపై టెంపరరీగా బండ్ నిర్మాణం
- సిల్ట్ తొలగించడానికి కంతనపల్లి బ్యారేజ్ గేట్లు తెరిచిన ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో 6.21 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు పూడిక మట్టి ఆటంకం కలిగిస్తున్నది. నిరుడు కురిసిన భారీ వర్షాలకు గోదావరిలో వచ్చిన వరద వల్ల ఇంటెక్ వెల్ దగ్గర భారీ స్థాయిలో బురద, మట్టి పేరుకుపోయింది. దీంతో ఈ వానాకాలం సీజన్‌లో వాటర్ లిఫ్ట్ చేయడానికి మోటార్లు ఆన్ చేయాలంటే సిల్ట్ తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆఫీసర్ల రిపోర్ట్‌తో రాష్ట్ర సర్కారు పూడిక మట్టి తొలగించే పనులకు శ్రీకారం చుట్టింది. ఇంటెక్వెల్దగ్గర నిల్వ ఉన్న బురద, మట్టిని తీయడానికి రూ.35 లక్షలు శాంక్షన్ చేసింది. దీంతో ఆఫీసర్లు గోదావరి నదిపై తాత్కాలిక బండ్ నిర్మించారు. నదిలో నీళ్లు నిల్వ ఉండకుండా కంతనపల్లి(సమ్మక్క) బ్యారేజ్ గేట్లు తెరిచారు. సిల్ట్ తొలగించే పనులు చేపట్టారు.
గోదావరిలో తాత్కాలిక బండ్ నిర్మాణం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గోదావరి నదిపై దేవాదుల గ్రామం దగ్గర దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఇంటెక్‌వెల్ నిర్మించారు. ఏడాదికి 60 టీఎంసీల చొప్పున లిఫ్ట్ చేయడానికి వీలుగా మూడు దశల్లో కలిపి 10 మోటార్లు అమర్చారు. ఈ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు.. 37 మండలాల్లోని 6.21 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇంటెక్‌వెల్ దగ్గర పేరుకుపోయిన సిల్ట్ తొలగించడానికి ఆఫీసర్లు గోదావరిలో తాత్కాలిక బండ్ నిర్మించారు. నదిలోని నీరు ఇంటెక్‌వెల్ వైపు రాకుండా ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది. పూడిక తొలగించే పనులు కంప్లీట్ కాగానే బండ్ తొలగిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం జేసీబీలు, పొక్లెయినర్లు, టిప్పర్ల సహాయంతో పూడిక తొలగించే పనులు జరుగుతున్నాయి.
కంతనపల్లి బ్యారేజ్ గేట్లు ఓపెన్..
దేవాదుల ఇంటెక్‌వెల్ దగ్గర పూడిక తీత పనులు చేస్తుండడంతో గోదావరిలో నీటి ప్రవాహం ఆగకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. దేవాదులకు దిగువన ఉన్న కంతనపల్లి(సమ్మక్క) బ్యారేజ్ 10 గేట్లు తెరిచి ఉంచారు. దీంతో ఎగువన ఇంద్రావతి నది నుంచి వస్తున్న వరద అంతా దిగువకు వెళ్లిపోయే విధంగా చేశారు. దీంతో బ్యారేజ్ కెపాసిటీ 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 0.58 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. గేట్లు తెరిచి ఉంచడంతో పాటు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో ఒకే విధంగా ఉండేలా చూసుకుంటున్నారు.
సిల్ట్ తొలగించే పనులు చేపట్టినం
ఈ వానాకాలంలో దేవాదుల ప్రాజెక్ట్ కింద ఆయకట్టుకు సాగునీరందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. గోదావరి నదిపై ఇంటెక్‌వెల్ దగ్గర మోటార్లు స్టార్ట్ చేయడానికి ఫోర్ బే లోకి వాటర్ రాకుండా సిల్ట్ అడ్డుగా ఉంది. మోటార్లను రన్ చేయాలంటే ముందుగా పూడిక మట్టి తొలగించాలి. దీని కోసం ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తే రూ.35 లక్షలు శాంక్షన్ చేసింది. త్వరలోనే పనులు పూర్తి చేసి మోటార్లు ఆన్ చేస్తాం.
‒ శరత్, దేవాదుల డీఈ, ఏటూరునాగారం