అలంకారప్రాయంగా శ్మశానవాటికలు, డంపింగ్​ యార్డులు

అలంకారప్రాయంగా శ్మశానవాటికలు, డంపింగ్​ యార్డులు

ఊరికి దూరంగా కొన్ని...రోడ్లు లేక మరికొన్ని నిరుపయోగం 

చెన్నూర్​, వెలుగు: గ్రామాల్లో లక్షలు ఖర్చుతో నిర్మించిన శ్మశాన వాటికలు, డింపింగ్ ​యార్డులు అలంకారప్రాయంగా మిగిలాయి. ఊరికి దూరంగా నిర్మించడంతో కొన్ని, సరైన రోడ్లు, రోడ్డు లేక మరికొన్ని నిరుపయోగంగా మారాయి. చెన్నూర్, కోటపల్లి మండలాల్లో 61 డంపింగ్ యార్డులను, వైకుంఠధామాలను నిర్మించారు. ఒక్కో శ్మశానవాటికకు రూ.10 లక్షలు, డంప్​ యార్డులకు రూ.2లక్షల చొప్పున ఈజీఎస్​ నిధులు వెచ్చించారు. వీటిని వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పలుచోట్ల నాసిరకంగా కట్టడంతో ఏండ్లు గడవకముందే పగుళ్లు తేలుతున్నాయి. 

ముఖ్యంగా శ్మశానవాటికలను గ్రామాలకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లేందుకు రోడ్లు కాదు కదా కొన్ని చోట్ల కనీసం నడక దారి కూడా లేదు. కరెంట్​, వాటర్​ సప్లై కల్పించలేదు. దీంతో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే ఎప్పటిలాగే ఊరి బయటకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు. కోటపల్లి మండలం దేవులవాడ వద్ద నది ఒడ్డున కాకుండా మరో చోట నిర్మించే సరికి గ్రామస్తులు సెంటిమెంట్​ ప్రకారం నది ఒడ్డునే దహన సంస్కారాలు నిర్వహిస్తూ శ్మశానవాటికను వినియోగించడం లేదు. చెన్నూర్​ మండలం సుద్దాల, కిష్టంపేట గ్రామాల్లో నది ఒడ్డునే ఉన్నప్పటికీ సౌకర్యాలు లేక వినియోగించడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ప్రజలకు అవగాహన కల్పించడం లేదు.