లక్షలకు లక్షలు వెనకేసుకోవడమే కాదు.. ఎదుటివారు ఆపదలో ఉన్నప్పుడు తోచినంత సహాయం కూడా చేయాలి. అలాంటి గొప్పమనసు తనకుందని నిరూపించాడు.. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్. ఓ పేద విద్యార్థి చదువుకు ఆర్థిక సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు.
మహాలింగాపూర్కు చెందిన అమృతన్ మావింకట్టి అనే విద్యార్థి ఇటీవల విడుదలైన పీయూసీ కామర్స్ ఫలితాల్లో 600లకు గానూ 571 మార్కులు సాధించాడు. ఆపై ఉన్నత చదువుల కోసం హుబ్బళ్లిలోని KLE ఇన్స్టిట్యూట్లో CA కోచింగ్ అడ్మిషన్ కోసం వెళ్లగా.. కళాశాల యాజమాన్యం రూ.85 వేలు ఫీజు చెల్లించాలని తెలిపింది. ఒకవేళ ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు వస్తే రూ.10 వేలు రాయితీ ఇస్తామని చెప్పింది. అనుకున్నట్లుగానే అమృతన్కి మంచి మార్కులు రావడంతో 10 వేలు రాయితీ పోగా 75 వేలు చెల్లించాల్సి వచ్చింది.
కానీ అమృతన్ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. 25వేలు సర్దుబాటు అవ్వగా.. మిగిలిన 50వేల కోసం అతని తల్లిదండ్రులు చాలా చోట్ల ప్రయత్నించారు. తెలిసిన వారినల్లా అప్పు అడిగారు. ఈ విషయం ఆనోటా ఈనోటా చేరి మంజునాథ్ హెబ్సూర్ అనే సామాజిక కార్యకర్తకు తెలిసింది. అతడు ఈ విషయాన్ని ముంబైలో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ నిర్వహిస్తున్న అక్షయ్ అనే తన స్నేహితుడికి చేరవేతెలియజేశాడు. అతనికి భారత క్రికెటర్లైన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలతో మంచి పరిచయం ఉందట.
అమృతన్ పరిస్థితిని తెలుసుకున్న అక్షయ్ వెంటనే కేఎల్ రాహుల్కు ఫొన్ చేసి.. విద్యార్థి సమస్యను అతనికి వివరించాడు. స్పందించిన రాహుల్.. అమృతన్ కు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. సదరు విద్యార్థి వివరాలు తెలుసుకొని ఫీజులతో పాటు పుస్తకాల కొనుగోలు, ఇతర అవసరాలకు సరిపడా డబ్బులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. కేఎల్ రాహుల్ సాయం తనకు అందిందని.. అతని అండతో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవడానికి ప్రయత్నిస్తానని అమృతన్ తెలిపాడు. తనకు అన్ని విధాలా సహకరించిన రాహుల్, అక్షయ్, మంజు హెబ్సూర్లకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
KL Rahul has financially helped a deserving (95%) student named Amrut Mavinkatti, who lost his mother from Mahalingapura to study B. Com at Hubballi’s KLE College through Akshay Sir.
— KLRAHUL TRENDS™ (@KLRahulTrends_) June 11, 2023
Man With Golden Heart @KLRahul ?❤ pic.twitter.com/6xcT9pEsx6