తెలంగాణ భాష ఎంత గొప్పదో తెలుసా..కవి డా. దాశరథుల నర్సయ్య .. .

తెలంగాణ భాష ఎంత గొప్పదో తెలుసా..కవి  డా. దాశరథుల నర్సయ్య .. .
  • కాలుష్య రక్కసిపై ...

  • బోనం.. బువ్వ.. కవిత్వం ..మనిషి మారాలి

తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ భాష మీద ఉన్న మక్కువతో ‘బోనం బువ్వ’ (తెలంగాణ అస్తిత్వ కవిత్వం) ను అందించిన డా. దాశరథుల నర్సయ్య.  ఇప్పుడు ప్రపంచాన్ని... ముఖ్యంగా భారతదేశాన్ని పీడిస్తున్న సమస్యలలో ఒకటైన కాలుష్య భూతంను తరమడానికి కలాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. నాలుగు లైన్లతో కూడుకున్న కవితలను ప్రతి పాదంలో 12 మాత్రలతో కూడిన, తనకు తానే ఏర్పరచుకున్న ఛందంలో అందంగా, తేలికైన పదాలలో ఏ చరణానికి ఆ చరణమే విడివిడి భావాలతో ఉండేలా అందించాడు. 

అకాల వర్షాలు పంటలను మింగేసినా, 
మండే ఎండలు మనుషుల్ని మాడ్చేసినా, 
కొత్త కొత్త రోగాలు ప్రాణాల్ని తోడేసినా,
 రుతుపవనాలు గతి తప్పినా, 
భూగోళం వేడెక్కినా అందుకు కారణం మనిషే. 

‘‘మనిషి భూమి మీద ఇపుడు  మాలిన్యం పెంచుతుంటే పంచభూత శక్తులన్ని కాలుష్యంతో నిండెను’’ మనిషి పంచభూతాలకు లోబడి ఉండాలి. కానీ వాటిపై ఆధిపత్యం చలాయించాలనుకుని, తన బతుకును తానే దుర్భరం చేసుకుంటున్నాడు. డా. దాశరథుల నర్సయ్య - కాలుష్యం పెరుగుతున్న తీరును మనం ప్రతిరోజూ చూసే సంఘటనల ద్వారానే అవగాహన కల్గిస్తున్నాడు. ఈనాడు నారసంచులు మోటైనాయి. ప్లాస్టిక్ సంచులు ఎక్కువైనాయి. ఇంటివద్దకు చెత్తబండి వస్తే అందులో అధికశాతం ప్లాస్టిక్ కవర్లే.  విషపూరిత వాయువులు గాలిలో చేరుతున్నాయి. గాలి దుమారాలొస్తే ప్లాస్టిక్ కవర్లు ఎగిరి వస్తున్నాయి. పెళ్లికి వెళ్ళినా అక్కడ తాగేసిన గ్లాసులతో డ్రమ్ములన్నీ నిండుతున్నాయి. అయినదానికీ, కానిదానికీ ప్లాస్టిక్ ని వాడుతున్నారు. మరే వ్యర్థ పదార్థమైనా కొన్నాళ్లకో, కొన్నేళ్లకో మట్టిలో కలిసిపోతుంది. కానీ.. ప్లాస్టిక్ కరగదు, కలిసిపోదు. 

‘‘ప్లాస్టిక్ సంచులు మాత్రం 
కాలుష్య భూతం 
తల్లి గర్భమందు సేరి 
కరగలేక భూమాతకు 
కడుపునొప్పి అధికమయ్యె’’ 

ఆహారాన్ని అవసరానికి మించి తిన్నా. అనవసరమైనవి తిన్నా మనకు కడుపునొప్పి వస్తుంది. ప్లాస్టిక్ సంచులు తన గర్భంలో చేరి భూమాతకు కడుపు నొప్పి అధికమయ్యెననడం కవికి భూమాతపై గల మమకారాన్ని తెలియజేస్తుంది. ప్లాస్టిక్​ను వాడకూడదని నేలతల్లి బిడ్డలమైన మనకు గుర్తు చేస్తున్నాడు నర్సయ్య. ఎండలు మండినప్పుడు గొంతెండి పోతుంది. పంటెండిపోతుంది. భూగర్భ జలం అడుగంటుతుంది. భూగోళం మండిపోతుంది. కరువు కోరలు చాస్తుంది. నదులలో పరిశ్రమల, మానవుల వ్యర్థాలు చేరి నీటి కాలుష్యం పెరుగుతున్నది. సముద్రాలలో కూడా చెత్త పేరుకుపోతున్నది. విషపూరితమైన చెత్తను తిని జలచరాలు మరణిస్తున్నవి. 

‘‘గ్లోబల్ వార్మింగ్ వల్ల 
భూగోళం వేడెక్కెను 
మంచు ఖండమంత కరిగి 
సముద్ర మట్టాలు పెరిగె’’
 

సునామీలు వస్తే జనం దిక్కుదివాణం లేక చచ్చిపోతారని హెచ్చరిస్తాడు కవి. అవసరం ఉన్నా లేకున్నా మనిషి వాహనాలు వాడుతున్నాడు. ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం పెంచుతున్నాడు. శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నాడు. చిమ్నీలు విషవాయువులు చిమ్ముతున్నవి. ఓజోన్ పొర క్షీణిస్తున్నది.

 అడవులను నరికేస్తే వానెలెలా కురుస్తాయి? చెట్లు బొగ్గుపులుసు వాయువును పీల్చుకొని, స్వచ్ఛమైన ప్రాణవాయువునిస్తాయి కదా! మరి చెట్లే లేకుండా గాలి ఎలా వస్తుంది? ప్రాణవాయు ఉంటేనే కదా మనిషి బతికేది! చెట్లను పెంచడానికి ఏళ్ళు పడతాయి. మరి క్షణాలలో చెట్లను నరకడానికి చేతులెలా వస్తాయి? రోడ్ల వెడల్పు అంటూ చెట్లను నరికేస్తున్నారు. అసలు చెట్ల పెంపకమే అభివృద్ధికి సూచిక అంటాడు నర్సయ్య. 

‘‘భూమికి మానం ప్రాణం 
చెట్టేనని గుర్తుంచుకొ
చెట్లులేని భూమి నేడు 
నగ్నంగా మారుతుండె’’ 
అప్పుడప్పుడూ నీటికి కటకటను అనుభవిస్తున్న మనం 
‘‘ప్రాణవాయువును కూడ 
సిలిండర్లలోన వుంచి 
పైపు ద్వారా పీల్చుకుంటూ 
తినే రోజులు వస్తాయి’’
అలా బతకడాన్ని కోరుకుందామా! వద్దు, అంతే కాదు
 ‘‘ఈ పాపం ఎవ్వరిదని 
ఒకరిమీద వేరొకరు 
తోసుకుంటూ కాలహరణ 
సేయడమిప్పుడు  కుదరదు’’,

కాలుష్యం మీద యుద్ధం ప్రకటించకపోతే రాబోయే రోజులలో ప్రమాద ఘంటికలు మోగుతాయని, కాలుష్యపు కోరలు పీకితే తప్ప మనిషి మనుగడ సాగించలేడని అంటాడు. భావి తరాలకు మంచినీటిని, మంచి గాలిని అందించకపోతే మనము వృథా అంటాడు. కాలుష్యం ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదమని హెచ్చరిస్తాడు. 

మరి మనమేం చెయ్యాలి? పరిష్కార మార్గాలను కూడా సూచిస్తున్నాడు కవి. పరిశుభ్రత పాటించనివాడు నాగరికుడెలా అవుతాడు? మనం పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాలలో పరిశుభ్రత ఉండేలా చూడాలి. ప్రతివారూ మొక్కలు నాటాలి. హరితహారం వంటి కార్యక్రమాలలో పాల్గొనాలి. నాటిన మొక్కలు ఎన్ని అని కాదు. 

పెరిగిన మొక్కల లెక్కలు కావాలి. ఆరంభ శూరత్వం వద్దు. శిశువు తల్లి గర్భంలో చేరినప్పటినుంచి ఎంత శ్రద్ధ తీసుకుంటామో, మొక్క మహా వృక్షమయ్యే వరకూ అంత శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల పెంపకం మీద పెట్టే దృష్టి చెట్ల పెంపకం మీద కూడా పెట్టాలి. పాఠశాల నుంచే పిల్లలకు మొక్కల పెంపకం విలువ తెలపాలి. పాఠశాల చివరిగంట ఆటపాటలతో పాటు మొక్కల పెంపకానికి కేటాయించాలి. 

స్వచ్ఛమైన గాలి పీల్చుతున్నామా? 
స్వచ్ఛమైన నీరు తాగుతున్నామా? 
కల్తీలేని తిండి తింటున్నామా? 
కల్మషం లేకుండా ఉంటున్నామా?

 మనిషి ప్రకృతితో యుద్ధం చేయకూడదు. సహజీవనం చేయాలి. తాను ఈ భూమి మీదకు వచ్చింది దోచుకోవడానికి కాదు. కలకాలం బతకడానికి, తాను బతుకుతూ, తన చుట్టూ ఉన్న జీవజాలాన్ని బతికించుకోవడానికి. ఇప్పటిదాకా పర్యావరణం గురించి పట్టించుకోని మనుషులు ఇకనైనా మారాలి. ఈ కవితలు చదివిన వాళ్లలో కొందరు మారినా - ఈ కవిత్వం సార్థకం. డా. దాశరథుల నర్సయ్య ప్రయత్నం సఫలం. 

-ఎ. గజేందర్ రెడ్డి -