బాపూఘాట్​లో మహాత్ముడి మహా విగ్రహం

బాపూఘాట్​లో మహాత్ముడి మహా విగ్రహం
  • ప్రపంచంలోనే ఎత్తయిన  స్టాచ్యూ ఏర్పాటుకు సర్కార్​ ప్రణాళికలు
  • ఎంత ఎత్తు ఉండాలనే దానిపై సమాలోచనలు
  • అక్కడే కమ్యూనికేషన్ స్కిల్స్, ఎథిక్స్ అండ్వ్యాల్యూస్ కోర్సుల ఎడ్యుకేషన్​ హబ్  
  • నమూనాలు, డిజైన్లపై చర్చలు, విస్తృత సంప్రదింపులు

 

హైదరాబాద్​, వెలుగు : మూసీ నదీ తీరంలోని బాపూఘాట్​లో ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఎలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ? ఎంత ఎత్తైన విగ్రహం పెడితే బాగుంటుందనే దానిపై సమాలోచనలు జరుపుతున్నది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా బాపూఘాట్ ను అటు ఆధ్యాత్మికంగా, ఇటు విద్యాబోధన కేంద్రంగా రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు.  ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్ ను తీర్చిదిద్దాలని, మహాత్ముడి అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.దీంతో అధికారులు బాపూఘాట్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి పనులపై ఫోకస్ ​పెట్టారు. 

ఎడ్యుకేషన్​ హబ్​గా..

అటు ఉస్మాన్​సాగర్​,  ఇటు హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసా, ఈసా నదుల సంగమ ప్రాంతంలో బాపూఘాట్ ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని గాంధీ సరోవర్​గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ బోధనలు, ఆయన ఆచరణ, ఆశయాలను ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్​తో పాటు  కమ్యూనికేషన్ స్కిల్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కోర్సులు నిర్వహించే ఎడ్యుకేషన్ హబ్​గా గాంధీ ఆశ్రమం కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.  బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీతో పాటు గాంధీ ఐడియాలజీ సెంటర్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలో అసెంబ్లీ ముందున్న గాంధీ విగ్రహమే పెద్దది

రాష్ట్రంలో అసెంబ్లీ ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహమే ఇప్పటివరకు పెద్దది. ధ్యాన ముద్రలో ఉన్న విగ్రహం ఎత్తు 22 అడుగులు. ‘మై లైఫ్ ఈజ్ మై మెసేజ్’ అనే సందేశంతో కాంస్యంతో దీన్ని తయారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు మూసీ తీరంలో విశాల  ప్రాంతం కావడంతో.. బాపూఘాట్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే దానిపై ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు. దేశ విదేశాల్లో ఉన్న గాంధీ విగ్రహాలపై  అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహాత్ముడి విగ్రహాల్లో పాట్నాలోని గాంధీ మైదాన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న  విగ్రహమే  అత్యంత ఎత్తయినది. దీని ఎత్తు 72 అడుగులు. 2013లో దీన్ని ఏర్పాటు చేశారు. 2018లో గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో ఐక్యతా చిహ్నంగా పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా దీన్ని నిర్మించారు. ఇప్పుడు హైదరాబాద్​లో అంతకంటే ఎత్తున గాంధీ విగ్రహం నిర్మించాలా? పాట్నాలో ఉన్న గాంధీ విగ్రహానికి మించిన ఎత్తులో దీన్ని నిర్మించాలా? అనేదానిపై చర్చిస్తున్నారు. ఇందుకోసం విస్తృత చర్చలు, సంప్రదింపులు జరపాలని అందరి సూచనలు స్వీకరించాలని సీఎం నిర్ణయించారు.