- సర్కిల్ ఆఫీసులకే పరిమితం
- సమస్యల పరిష్కారానికి ఏడాది కింద 150 వార్డు ఆఫీసుల ఏర్పాటు
- అన్ని శాఖల ఆఫీసర్లు అందుబాటులో ఉండాలని ఆదేశాలున్నా బేఖాతర్
- ఎప్పుడు వెళ్లినా ఆపరేటర్, వాచ్ మెన్ లే కనిపిస్తున్నరు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో వార్డు స్థాయి పాలన పడకేసింది. కొందరు అధికారులు వార్డు ఆఫీసులకి బదులుగా సర్కిల్ ఆఫీసులకే పరిమితమవుతున్నారు. ప్రజాసమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు వార్డు స్థాయి పాలనను గతేడాది జులై 16న అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా గ్రేటర్‌లోని 150 వార్డుల్లో ఒక్కో ఆఫీసు ఏర్పాటు చేశారు.
ఇక్కడ పది డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారు. వీరు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తారు. ప్రస్తుతం వార్డు ఆఫీసులకు వెళ్తే కొన్ని చోట్ల సిస్టమ్ ఆపరేటర్లు, మరికొన్ని చోట్ల వాచ్ మెన్ లు మాత్రమే కనిపిస్తున్నారు. అధికారుల గురించి అడిగితే ఫీల్డ్‌లో ఉన్నారని సమాధానం చెప్తుండడంతో వారికే కంప్లయింట్ ఇచ్చి వెనుదిరిగుతున్నారు.
ఫిర్యాదుల స్వీకరణ.. ఫీల్డ్ లెవెల్ పర్యవేక్షణ
వార్డు ఆఫీస్‌లో అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్, ఇంజినీర్, టౌన్ ప్లానర్, ఎంటమాలజిస్ట్, శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్ వైజర్, వాటర్ బోర్డు నుంచి అసిస్టెంట్, విద్యుత్ శాఖ నుంచి లైన్ మెన్ లేదా లైన్ ఇన్ స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు రిసెప్షనిస్ట్ అందుబాటులో ఉండాలి.
వీరు ఉదయం తాగునీటి, సీవరేజీ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ తదితర సమస్యలపై ఫీల్డ్లెవెల్లో పర్యటించి సమస్య పరిష్కరించాలి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వార్డు కార్యాలయంలో అందుబాటులో ఉండి కంప్లయింట్స్తీసుకోవాలి. ఈ డేటాను ఎంట్రీ చేసి సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేసి సమస్య పరిష్కారమైన తర్వాత ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి. ఇప్పుడు వార్డు ఆఫీసుల్లో ఒక్క అధికారి కూడా కనిపించడం లేదు.
పరిష్కరించాల్సింది ఇలా ..
చెత్త సమస్య, పాట్ హోల్స్‌ని పూడ్చడం, మ్యాన్ హోల్స్ మూతల ఏర్పాటు, రోడ్డు పక్క న ఉన్న సిల్ట్ తీయడం, స్ర్టీట్ లైట్స్ రిపేర్స్, యాంటీ లార్వా ఆపరేషన్, జంతువులు మరణించాయని వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించాలి.
డ్రైనేజీలు బ్లాక్, సీ అండ్ డీ(భవన నిర్మాణ వ్యర్థాలు) క్లీనింగ్ కోసం అయితే 48 గంటలు, ఫాగింగ్ ఆపరేషన్ కు 24 గంటల నుంచి 48 గంటలు, ఫుట్ పాత్ రిపేర్లయితే 72 గంటలు, పెట్ డాగ్ లైసెన్స్ కోసం వారం, సీనియర్ సిటిజన్, దివ్యాంగుల ఐడీ కార్డులను 15 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్‌కు సంబంధించి మెయింటెనెన్స్ సమస్యలను నెలరోజుల్లో పరిష్కరించాలి. క్లీనింగ్ అయితే అదే రోజు చేయించాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్కటి సకాలంలో జరగడం లేదు.