సింగరేణిపై గ్రేటర్ ఎఫెక్ట్

సింగరేణిపై గ్రేటర్ ఎఫెక్ట్

గుర్తింపు ఎన్నికలు ఇప్పుడే వద్దంటున్న టీఆర్ఎస్ అనుబంధ యూనియన్

జీహెచ్​ఎంసీ రిజల్ట్ ప్రభావం పడుతుందని నేతల్లో ఆందోళన

ఎలక్షన్‌‌‌‌ పెట్టాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష యూనియన్లు

మందమర్రి, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ ఎన్నికల రిజల్ట్​ ఎఫెక్ట్ సింగరేణికి తగిలింది. దుబ్బాక హీట్​ తగ్గక ముందే.. ముందస్తుగా జీహెచ్​ఎంసీ ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగలడంతో సింగరేణిలో ఆ పార్టీ అనుబంధ కార్మిక యూనియన్(టీబీజీకేఎస్​)​కు గుబులు పట్టుకుంది. ఇలాంటి పరిస్థితులలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు ఎలా వెళ్లేది అనే డైలమా.. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్​ శ్రేణులలో నెలకొంది.
రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి 6  జిల్లాల్లో విస్తరించి ఉంది. నాలుగు ఎంపీ, 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం చూపే  ఈ ఎన్నికల్లో తిరిగి గుర్తింపు సంఘంగా ఏర్పడి లబ్ధి పొందాలని భావిస్తున్న టీబీజీకేఎస్ లీడర్లకు, కోల్​బెల్ట్​ ఎంపీ.. ఎమ్మెల్యేలకు గ్రేటర్​ రిజల్ట్​ మింగుడుపడని విషయంలా మారింది. అధికార పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో ఎన్నికలకు పోతే.. గుర్తింపు సంఘం మరోసారి నెగ్గడం కష్టమని ఆ సంఘం లీడర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే ఎన్నికలు నిర్వహించవద్దంటూ యూనియన్​ లీడర్లు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్​ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ఓటమి ఆంశంపై ఇప్పటికీ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు చర్చించుకుంటున్నారు. జరగబోయే యూనియన్​ ఎన్నికల్లో అధికార పార్టీ అనుబంధ యూనియన్​కి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని, సింగరేణిలోనూ మార్పు తప్పదంటూ లీడర్ల ఎదుటే కార్మికులు ప్రస్తావిస్తున్నారు. దుబ్బాక, హైదరాబాద్​ ఎలక్షన్ల ఊపుతో బీజేపీ మద్దతున్న బీఎంఎస్​ ఎక్కడ బలపడుతుందోననే భయం టీబీజీకేఎస్​లోనూ నెలకొంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని భావించిన రాష్ట్ర సర్కార్​ కూడా ఇప్పుడు ఆసక్తి చూపించట్లేదని ప్రతిపక్ష యూనియన్లు అంటున్నాయి.

ఇప్పుడైతే కష్టమే..

సింగరేణిలో  మూడేండ్లుగా గుర్తింపు సంఘంగా ఉన్న  టీబీజీకేఎస్..​ యూనియన్​ ఎన్నికల టైంలో  సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, యూనియన్​లో అంతర్గత కుమ్ములాటలు, ఎంపీ, ఎమ్మెల్యేల ప్రాబల్యం పెరిగిపోవడంతో యూనియన్​ లీడర్లకు రానున్న గుర్తింపు సంఘం ఎన్నికలు సవాల్​గా మారాయి. సంస్థలో ఉద్యోగుల సంఖ్యను లక్షకు  చేరుకునేలా కొత్తగా 25 బొగ్గు బావులును ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కొత్త గనులతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రకటించినప్పటికీ.. ఇవేవీ ఆచరణలో పెట్టలేదని సర్కారుపై కార్మికుల్లో అసమ్మతి నెలకొంది. కారుణ్య నియామకాల తతంగం ఓ ఫార్స్​గా నడుస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుర్తింపు సంఘం లోపాలే ఇందుకు కారణమంటూ కార్మికవర్గం బహిరంగంగా విమర్శలు చేయడం, తాజాగా మావోయిస్టు అనుబంధ సికాస టీబీజీకేఎస్​ లీడర్ల అవినీతి, అక్రమాలపై ప్రకటనలు చేయడం ఆ  యూనియన్​ లీడర్లకుకంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రతి చిన్న పనిలో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రాబల్యం పెరగడంతో యూనియన్​ లీడర్లు కార్మికుల ఎదుట చులకనైపోయారు.

ఫామ్ లోకి వస్తున్న బీఎంఎస్

గత ఎన్నికల్లో రాష్ట్ర ఉద్యమ నేపథ్యంతో బరిలో దిగి న టీబీజీకేఎస్​ 11 ఏరియాలకు 9 చోట్ల మాత్రమే గెలుచుకోగా.. ప్రస్తుతం ఎన్కికలకు పోతే ఏమవుతుందోననే ఆందోళన ఆ యూనియన్ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు సింగరేణి వ్యాప్తంగా బీఎంఎస్​ యూనియన్​ బలోపేతం అవుతుండటం.. సింగరేణిలో మార్పు తప్పదన్న కార్మికుల అభిప్రాయాల నేపథ్యంలో డిసెంబర్​లో గుర్తింపు ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్ కాదనే వాదన టీబీజీకేఎస్​ యూనియన్​లో బలపడింది. ఎన్నికల ప్రక్రియ కోసం రాష్ట్ర సర్కార్​తో కేంద్ర కార్మికశాఖ ఆఫీసర్లు సంప్రదింపులు జరిపేందుకు ఇప్పటికే ప్రయత్నించారు. గుర్తింపు ఎన్నికలకు సిబ్బందిగా ప్రభుత్వ టీచర్లు, రెవెన్యూ శాఖ సిబ్బంది అవసరం కాగా ఇవన్నీ రాష్ట్ర సర్కార్​ చేతిలో ఉండటంతో వారి నుంచి పర్మిషన్​ కోసం  కేంద్ర కార్మికశాఖ సంప్రదింపులకు రెడీ కాగా.. రాష్ట్ర సర్కార్​ మాత్రం ఎలక్షన్​ నిర్వహణకు ఇంట్రస్ట్ చూపలేదు. సింగరేణిలో నెలకొన్న ప్రతికూలపరిస్థితుల నేపథ్యంలోనే టీబీజీకేఎస్​ యూనియన్​ గుర్తింపు ఎన్నికల కోసం రాష్ట్ర సర్కార్​పై ఒత్తిడి తీసుకరాలేదని ఇతర యూనియన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా దుబ్బాక అసెంబ్లీ బై ఎలక్షన్​, గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ ఎన్నికల్లో టీఆర్ఎస్​ ఓటమి నేపథ్యంలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎలక్షన్​ డిసెంబర్​లో నిర్వహిస్తే గట్టెక్కడం కష్టమని గుర్తింపు సంఘం  లీడర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష యూనియన్లు డిసెంబరు లేదా జనవరిలో నిర్వహించాలని పట్టుపడుతున్నాయి.

గడువు ముగిసి ఏడు నెలలు

2017 అక్టోబర్​ 5న జరిగిన గుర్తింపు ఎన్నికలలో టీఆర్​ఎస్​ అనుబంధ కార్మిక యూనియన్ ‘టీబీజీకేఎస్’ గెలిచింది. ఆర్నెళ్లు ఆలస్యంగా  2018 ఏప్రిల్​లో గెలిచినట్లుగా కార్మిక శాఖ నుంచి సర్టిఫికేట్​ తీసుకుంది. 2020 ఏప్రిల్​తో ఈ సంఘం గుర్తింపు ముగియగా.. ఇప్పటికి ఏడు నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో డిసెంబరులో  కేంద్ర కార్మికశాఖ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రక్రియను ప్రారంభించడంతో కార్మిక సంఘాల నేతలు వివిధ కార్యక్రమాలతో జోష్​ పెంచారు. యూనియన్​ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం రెడీ అంటూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ప్రకటనలు గుప్పించింది. మరోవైపు డిసెంబర్​లో సింగరేణి ఎన్నికల నిర్వహించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర కార్మిక శాఖ అందుకు సంబంధించిన ప్రాసెస్​ను కొద్దిరోజుల కిందటి దాకా కొనసాగించింది. సింగరేణి మేనేజ్​మెంట్​కు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కార్మిక శాఖ లెటర్లు రాసి, ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించేందుకు రెడీ అయింది. దీంతో డిసెంబర్​లో ఎన్నికలు పెట్టే ఛాన్స్ ఉందని అందరూ భావించారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్​నుంచి నవంబర్​ ఫస్ట్ వీక్​ దాకా ఎన్నికల వాతావరణం కన్పించింది. కార్మిక సంఘాలు కార్యక్రమాలతో కార్మికుల మద్దతు కోసం పోటీపడ్డాయి.

For More News..

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మరింత దూరం

మేడిగడ్డ బ్యారేజీ పై ఇంటర్​స్టేట్​ రాస్తా బంద్​.. పెరిగిన 50 కి.మీ. దూరం

ఆన్ లైన్‌లో లోన్.. తీర్చలేక ఆత్మహత్య