హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం చేజారిపోయిన డివిజన్లలో గల్లీ లీడర్లు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. ఎన్నికలప్పుడు క్యాండిడేట్స్ చుట్టే తిరిగిన గల్లీ నాయకులు, కార్యకర్తలను ఓడిన నేతలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దగ్గరకు తీసేవారు లేక, నేతలను కలవలేక కిందా మీద అయితున్నట్టు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి షాక్ తగిలి అదికాస్త కిందిస్థాయి నేతలపై పడింది. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఓడిపోయిన క్యాండిడేట్స్, ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారే విమర్శలు వస్తున్నా యి. పదవీలో ఉన్నన్ని రోజులు వెంట తిప్పుకుని, ఇప్పుడు ఓడిపోవడంతో తమను పక్కన పెట్టేస్తున్నారని కొందరు గల్లీ లీడర్లు వాపోతున్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ గెలిచిన ప్రాంతాల్లోనైతే తమ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. కనీసం లోకల్ ఎమ్మెల్యేను కలిసే వీల్లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. పోనీ ఇతర పార్టీల వైపు పోదామంటే అక్కడా కూడా ఎలాంటి పరిస్థితులుంటాయోనని ఆగిపోతున్నట్టు తెలిసింది.
కార్యకర్తలను నమ్ముతలే..
ఎన్నికల టైంలో పార్టీ కోసం క్యాండిడేట్ తరఫున ప్రచారం చేసి నిరంతరం వెంట తిప్పుకున్న గల్లీ లీడర్లను పార్టీ పెద్దలు దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారే తమ బస్తీ నుంచి వెళ్లి పార్టీ లీడర్ ను కలిసినా ఎలాంటి రెస్పాన్స్ లేదని ఉప్పల్ సెగ్మెంట్ లోని డివిజన్ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ సెగ్మెంట్ లో 3 డివిజన్లను టీఆర్ఎస్ మిస్ చేసుకోగా, రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్ల పరిధిలో వరద సాయం ప్రభావం చూపింది. పెండింగ్ లో ఉన్న వరద సాయం గురించి స్థానికులు నిలదీస్తున్నా వారు పట్టించుకోవడం లేదని వాపోయారు. అయితే ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలెవరిని కూడా పార్టీ పెద్దలు నమ్మడంలేదని కేసీఆర్ నగర్ లో ఉండే ఓ టీఆర్ఎస్ నేత ఆవేదనతో చెప్పారు.
లోకల్ లీడర్లను బాధ్యులను చేస్తూ..
గ్రేటర్ పరిధి అసెంబ్లీ సెగ్మెంట్లలోని అన్ని డివిజన్లలో క్యాండిడేట్స్ ఖరారు, ప్రచారాలు లోకల్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరిగాయి. సిట్టింగ్ కార్పొరేటర్ల ఓటమికి లోకల్ లీడర్లను బాధ్యులను చేస్తూ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నట్టు తెలిసింది. సనత్ నగర్ సెగ్మెంట్ లోని6 డివిజన్లలో మూడింటిని బీజేపీ గెలుచుకుంది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ డివిజన్ కమిటీ సమావేశానికి కార్యకర్తలను పిలవకుండానే పూర్తిచేసినట్టు సమాచారం. నాంపల్లి సెగ్మెంట్ లోనూ గుడి మల్కాపూర్ స్థానాన్ని బీజేపీ గెలవగా, అక్కడ కూడా పార్టీ కార్యకర్తలకు ఆదరణ లేకుండా పోయిందని వాపోతున్నారు. తమను పార్టీ దూరం పెడుతుండడంతో ఇతర పార్టీల్లోకి వెళ్తామంటున్నా కూడా లోకల్ ఎమ్మెల్యే రెస్పాండ్ అవడం లేదని, ఆయనను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు.