పొద్దుగాల్ల 7 నుంచి పొద్దుమీక్కి 6 గంటల దాకా ఓటింగ్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 18 ఏండ్ల తర్వాత ఇప్పుడు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 150 డివిజన్లలో 1,122 మంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. 9,101 పోలింగ్ సెంటర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. పోలింగ్ సెంటర్లకు అన్ని దిక్కులా 100 మీటర్ల మేరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. గ్రేటర్లో 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా పేషెంట్లకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటేసేందుకు అనుమతి ఉంటుంది. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది. సోమవారం నగరంలోని 30 సర్కిల్ ఆఫీస్‌ల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఎలక్షన్ స్టాఫ్‌కు పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో స్టాఫ్ సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
అబ్జర్వర్లకు కంప్లయింట్ చేయండి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఏదైనా రాజకీయ పార్టీ లీడర్లు కానీ, క్యాండిడేట్లు కానీ అక్రమాలకు పాల్పడితే ఎలక్షన్ అబ్జర్వర్లకు కంప్లయింట్ చేయాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. సర్కిళ్లవారీగా నియమించిన జనరల్ అబ్జర్వర్లకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
పొద్దున ఐదున్నరకే ప్రాసెస్ స్టార్ట్
ఎలక్షన్ సిబ్బంది అంతా మంగళవారం పొద్దున 5.30 గంటలకే పోలింగ్ సెంటర్లలో రెడీగా ఉంటారు. 6 గంటల నుంచి 6.15 గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 6.55 గంటలకు బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి.. 7 గంటలకు పోలింగ్ మొదలుపెడ్తారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసి, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 1,752 అత్యంత సమస్యాత్మక, 2,934 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. పోలింగ్‌లో 36,404మంది సిబ్బంది పాల్గొంటున్నారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుతోపాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
జాగ్రత్తగా విధులు నిర్వర్తించండి: పార్థసారథి
జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని ఎన్నికల సిబ్బందికి పార్థసారథి సూచించారు. సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ ముగిసే వరకు క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని, ఓటర్లకు సీరియల్ నంబర్ వేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేసి ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ పూర్తవగానే బ్యాలెట్ పేపర్ అకౌంట్ తయారు చేయాలని, పీవో సర్టిఫై చేసిన అకౌంట్ కాపీలను అక్కడ ఉన్న క్యాండిడేట్లు, వారి ఏజెంట్లకు అందజేయాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులను, ఎన్నికలకు సంబంధించిన అన్ని పేపర్లను కవర్లలో ఉంచి సీల్ చేయాలన్నారు. పోలింగ్ సెంటర్లలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు సీల్ వేయాలని కోరుకుంటే వారికి పీవోలు అనుమతి ఇవ్వాలని తెలిపారు. సీల్ చేసిన ఎలక్షన్ మెటీరియల్‌ను పోలీసు బందో బస్తుతో రిసెప్షన్ సెంటర్లకు తరలించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన క్యాండిడేట్లు, వారి ఏజెంట్లు వారి సొంత వాహనంలో రిసెప్షన్ సెంటర్ వరకు రావడానికి అనుమతి ఉంటుందన్నారు. రిసెప్షన్ సెంటర్‌కు చేరిన ఎలక్షన్ మెటీరియల్‌ను రిటర్నింగ్ ఆఫీసర్లు స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చాలన్నారు. స్ట్రాంగ్ రూంలో పోలింగ్ స్టేషన్‌ల వారీగా మార్క్ చేసిన గడులలో బ్యాలెట్ బాక్సులు ఉంచాలని సూచించారు. ఒకే బిల్డింగ్‌లో ఒకటి కన్నా ఎక్కువ వార్డులుంటే బాక్సులు భద్రపరచడంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాలెట్ బాక్సులన్నీ స్టాంగ్ రూంలో పెట్టాక తాళం, సీల్స్ వేసి ఆర్మ్ గార్డ్స్‌కు అప్పగించాలని పార్థసారథి సూచించారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు కోరితే సీల్ వేయడానికి వారిని అనుమతించాలన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద 24 గంటలు పోలీస్ సిబ్బంది కాపలా ఉంటారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎవరైనా అభ్యర్థి స్ట్రాంగ్ రూంల వద్ద తమ ఏజెంట్లను కాపలా ఉంచాలనుకుంటే ముగ్గురు ఏజెంట్లను నియమించుకోవడానికి అవకాశమివ్వాలన్నారు. ఏజెంట్లు స్ట్రాంగ్ రూంకు 100 మీటర్ల దూరంలో కాపలా ఉండొచ్చని తెలిపారు. స్ట్రాంగ్ రూంకు సీల్ చేశాక తెరిచేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో తెరవాల్సి వస్తే పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే ఓపెన్ చేయాలన్నారు. ఈ వివరాలు లాగ్ బుక్‌లో ఎంటర్ చేయడంతోపాటు మొత్తం ప్రాసెస్‌ను వీడియో తీయాలని సూచించారు. స్ట్రాంగ్ రూంలను అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు రోజు తెరవాలని, ఎన్నికల సందర్భంగా చేపట్టే ప్రతి ప్రక్రియను వీడియో తీయాలని సూచించారు.
కరోనా జాగ్రత్తలతో పోలింగ్
కరోనా నేపథ్యంలో ఆఫీసర్లు పలు జాగ్రత్తలను తీసుకున్నారు. అన్ని పోలింగ్ సెంటర్లలో సోమవారం శానిటైజేషన్ చేశారు. 80 ఏండ్లు పైబడిన వారు, నవంబర్ 1 తర్వాత పాజిటివ్ వచ్చిన కరోనా పేషెంట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలని సూచించడంతో వీరి నుంచి 260 అప్లికేషన్లు ఆఫీసర్లకు అందాయి. ఎవరైనా అప్లయ్ చేసుకోని కరోనా పేషెంట్లు ఉంటే వారు పోలింగ్సెంటర్లకు వచ్చి ఓటు వేయవచ్చు. వారి కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాల్సి ఉంటుంది.
ఓటర్ ఐడీ లేకపోతే గుర్తింపు కార్డు తప్పనిసరి
ఓటర్లు ఓట్ స్లిప్‌తో పాటు ఓటర్ ఐడీ లేకపోతే 21 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి తప్పని సరిగా తీసుకొని వస్తే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి స్తామని ఎన్నికల ఆఫీసర్లు చెప్పారు. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాసు పోర్టు, ఆధార్ కార్డు , రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీకార్డు లతో పాటు తదితర వాటితో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వివరించారు.
18 ఏండ్ల తర్వాత మళ్లీ బ్యాలెట్
2002 వరకు ఎన్నికలు బ్యా లెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరిగాయి. తర్వాత మళ్లీ ఇప్పుడు అలానే జరుగుతున్నాయి.అంటే 18 ఏండ్ల తర్వాత బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరుతుండటంతో చాలా మందికి ఓటేసే విధానంపై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ప్రతి ఎన్నికల్లో ఈవీఎం ద్వారా జరుగుతుండటంతో ఈవీఎంలకు ఓటర్లు అలవాటుపడ్డారు. ఈ సారి బ్యాలెట్ ద్వారా జరుగుతుండటంతో ఓటర్లకు అవగాహన కల్పించేలా ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి ఓటరుకు ఓటేసే విధానంపై ఆఫీసర్లు సూచనలు చేయనున్నారు.
పోలింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్
డీఆర్‌సీ సెంటర్స్‌తో పాటు పోలింగ్, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్స్ వద్ద సోమవారం నుంచి 144 సె క్షన్ అమలు చేస్తున్నారు. సోమవారం నుంచి డిసెంబర్ 5
ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుం దని నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మంగళవారం పోలింగ్ నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఆ ప్రాం తాల్లో ఆంక్షలు విధించారు. ఇందుకు 3 కమిషనరేట్ల పరిధిలో 43,500 పోలీసులతో పాటు మరో 8,000 మంది హోంగార్డ్స్ తో భద్రతా ఏర్పాట్లు చేశారు.