
హైదరాబాద్ సిటీ, వెలుగు:జీహెచ్ఎంసీలో స్టాఫ్ తక్కువగా ఉండటంతో ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. కోటిన్నర జనాభాఉన్న గ్రేటర్‌కు ఔట్సోర్సింగ్, పర్మినెంట్ఉద్యోగులు కలిపి సుమారు లక్ష మంది వరకు అవసరం ఉండగా, 31 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ విషయంలో మనం ముంబై, బెంగళూర్, చెన్నై తదితర నగరాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాం. అక్కడ జనాభాకు సరిపడే విధంగా ఇక్కడున్న స్టాఫ్‌తో పోలిస్తే రెండితలు, కొన్నిచోట్ల మూడింతల స్టాఫ్ కూడా ఉన్నారు. పుణే లాంటి చిన్న నగరంలో కూడా మనకంటే ఎక్కువగానే స్టాఫ్ ఉన్నారు.
ఈ పరిస్థితి నుంచి అధిగమించేందుకు కనీసం ఔట్సోర్సింగ్ఉద్యోగులను తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. 15 ఏండ్లుగా బల్దియాలోకి ఔట్సోర్సింగ్ పద్ధతిన ఒక్కరిని కూడా తీసుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. సిటీని శుభ్రంగా ఉంచేందుకు శ్రమించే శానిటేషన్వర్కర్లు, కీలకమైన టౌన్‌ప్లానింగ్ లో కూడా ఉద్యోగుల కొరత వేధిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేసిన ప్రసాద్ రావు కమిటీ, ఆల్‌పార్టీ కమిటీలు 60 శాతం ఖాళీలున్నాయని, తక్షణమే స్టాఫ్‌ను పెంచాలని సూచించినా పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈ విషయాన్ని లెక్క చేయలేదు.
Also Read:-12 జోన్లుగా రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ మధ్య విస్తరణ..
పైగా రిటైర్అయిన వారినే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కొనసాగించేందుకు అనుమతి ఇచ్చి నిరుద్యోగులకు మొండి చేయి చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రిటైర్ట్ అయిన వారిని తొలగించింది. రెండు నెలల కింద వంద మంది ఇంజినీర్లను కేటాయించింది. కానీ, మిగతా విభాగాల్లో ఏ మార్పూ రాలేదు. ఉన్న పనితో పాటు ప్రజాపాలన దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, రేషన్ కార్డులు ఇలా ఏ కార్యక్రమమైనా ఉన్నవారితోనే చేయిస్తున్నారు.
లక్షకు వేయి మంది ఉండాలె...
నగరం క్లీన్అండ్ గ్రీన్‌గా ఉంచడంతో పాటు ట్యాక్స్‌లు వసూలు చేయడం, సిటిజన్స్ సేవల కోసం బల్దియాకు ఎంత లేదన్నా లక్షకు వేయి మంది స్టాఫ్ అవసరముంటుంది. కానీ, ప్రస్తుతం 4 వేల మంది పర్మినెంట్ఎంప్లాయీస్, 27 వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. సిటీలో రోజూ అన్ని రోడ్లు క్లీన్ చేయాలంటే దాదాపు 50 వేల శానిటేషన్వర్కర్స్అవసరం ఉంటుంది. అయితే, గ్రేటర్ వ్యాప్తంగా 18,500 మంది కార్మికులే పని చేస్తున్నారు.
వీరు వీఐపీలు తిరిగే మెయిన్‌రోడ్లను ఊడ్చేసరికే టైం అయిపోతోంది. కొన్ని కాలనీల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి కానీ ఊడ్వడం లేదు. అలాగే కీలమైన ఎంటమాలజీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ శాఖలో కేవలం 2,292 మంది ఔట్సోర్సింగ్స్టాఫ్ మాత్రమే పనిచేస్తున్నారు. ఈ రెండు వేల మందే సుమారు కోటిన్నర మందికి దోమలు కరవకుండా, వ్యాధులు రాకుండా చూసుకోవాల్సి వస్తోంది. వర్కర్ల స్థానంలో యంత్రాలతో క్లీన్ చేయిద్దామంటే ఆ పనులు చేయకుండానే బిల్లులు చెల్లిస్తున్నారు.
కమిషనర్ ఫోకస్..
ఉద్యోగుల కొరతపై కమిషనర్ ఇలంబరితి ఫోకస్ పెట్టారు. కొన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతులు లేవని, అప్రూవల్ కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఏ ఏ శాఖలో ఎంత మంది అవసరం ఉంది? ప్రస్తుతం ఎంతమంది భర్తీ చేస్తే ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది అన్న విషయాలపై స్టడీ చేస్తున్నారు. ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి లెటర్ రాయనున్నట్లు తెలిసింది.