గ్రేటర్​ హామీలను గాలికొదిలేసిన్రు

విజన్ లేకనే హైదరాబాద్ ను ముంచారు 

తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు రెండోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓట్లు వేయలేదని గురుకుల ట్రస్ట్ భూముల్లో కొన్ని ఇండ్లు, ఒక ప్రముఖ సినీ నటుడి ప్రహరీ గోడను కూలగొట్టి ఒక ప్రాంతం వారిలో వణుకు పుట్టించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించింది. ఇది ఆ ప్రాంత ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా 2016 గ్రేటర్ ఎన్నికల్లో 2014 అసెంబ్లీ ఎన్నికలకంటే ఎక్కువగా టీఆర్ఎస్  150 డివిజన్లకు 99 గెలవగలిగింది. హైద్రాబాద్ ను ఇస్తాంబుల్ కు దీటుగా డెవలప్​ చేస్తామనే మాటలను నమ్మారు. ప్రజలు కూడా ఎన్నో ఆశలతో పట్టం కట్టారు. వాటన్నింటినీ టీఆర్ఎస్​ పార్టీ గాలికొదిలేసింది.

2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్​ అన్ని పార్టీల కంటే ముందు 15 పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేసి హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పుకుంది. తాము చేయగల్గినవే చెపుతున్నామని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి చెప్పినవన్నీ చేస్తామని మంత్రి కేటీఆర్​ కూడా ప్రకటించారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి మిగతా పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చినా వారు అమలు చేయలేరని ప్రజలకు పరోక్షంగా చెప్పారు. హుస్సేన్ సాగర్ ను మంచి నీటి సరస్సుగా మారుస్తామని, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను అభివృద్ధి చేస్తామని, ప్రతి ఇంటికీ మంచి నీరు సరఫరా చేస్తామని, 3,500 పై చిలుకు కాలువలను ఆధునీకరిస్తామని, నగరంలోని 1,500 మురికివాడలను అభివృద్ధి చేసి వాటి స్థానంలో డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఉచితంగా ఇస్తామని, రోడ్లపై గుంత చూపితే పరిహారమిస్తామని ఇలా ఎన్నో హామీలు గుప్పించారు.

బాగుపడింది కల్వకుంట్ల కుటుంబమే

ఈ హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజల ముందున్నది. వారి బతుకులు ఎంత బాగున్నాయో, కల్వకుంట్ల కుటుంబం, వారి అనుచరుల కుటుంబాలు ఎంత బాగుపడ్డాయో ప్రజలు చూస్తూనే ఉన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో టీఆర్ఎస్​ వెబ్​సైట్​ నుంచి ఏకంగా గ్రేటర్ 2016 ఎన్నికల మేనిఫెస్టోనే తీసేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత హామీలను గాలికొదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. ప్రజల అవసరాలను మరిచి తమ అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి ప్రగతి భవన్ కట్టుకున్నారు. అర్ధరాత్రి సెక్రటేరియట్ కూలగొట్టే పనులను ఆరంభించి అమ్మ వారి గుడి, మసీదులను నేలమట్టం చేసి ప్రజల విశ్వాసాలను దెబ్బతీశారు. సెక్రటేరియట్ కు కొత్త బిల్డింగ్​ పేరిట వందల కోట్లు వృధా చేస్తున్నారు. ఈ వృధా ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నా వినపడనట్టు ముందుకు వెళుతున్నారు.

 

ఇదా మీ విజన్?

విజన్ ఉన్న నాయకులుగా గొప్పలు చెప్పుకునే తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ విజన్ ఏమైనది? మొన్నటి వర్షాలకు వేలాది కుటుంబాలు ముంపునకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయారు? వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో ఇండ్లు వదిలి పోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సాయం అందించడంలోనూ, గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేయబోయారు. తమకు నచ్చిన వారికి రూ.10 వేలు అందజేశారు. అందులోనూ కొందరు అధికార పార్టీ బ్రోకర్లు ఆ డబ్బులు మేమే ఇప్పించామని కొంత డబ్బును దండుకున్నారు. తాము ఆదుకుంటున్నామని షో చేయబోయిన మంత్రులు కేటీఆర్, తలసాని, మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజాగ్రహం చూసి తోక ముడుచుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినది.

బీసీలను మోసం చేసిన టీఆర్ఎస్

గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన మరుసటి రోజే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి, వాటిపై అభ్యంతరాలు తెలిపి సరి చేయించుకునే అవకాశాన్ని ప్రజలకు, పార్టీలకు ఇవ్వలేదు. తప్పుడు బీసీ గుర్తింపు విధానాన్ని అనుసరించి తమకు అనుకూలమైన విధంగా బీసీల వార్డ్ రిజర్వేషన్లను చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ లెక్క ప్రకారం మొత్తం 150 డివిజన్లలో 75 డివిజన్లలో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశమున్నా 62 డివిజన్లకే పరిమితం చేశారు. ఎస్సీలకు 10, ఎస్టీలకు 2 పోను బీసీలకు 63 డివిజన్లు రిజర్వు చేయాల్సిఉన్నా 50 డివిజన్లే ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసిన కుట్ర. ప్రతి ఎన్నికల సమయంలో డివిజన్లు, రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణకు జీహెచ్ఎంసీ చట్టంలో అవకాశమున్నా ప్రభుత్వం ఈ మధ్య ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఎటువంటి మార్పులు లేకుండా పాత డివిజన్లు, రిజర్వేషన్లు యథాతథంగా, వరుసగా రెండు ఎన్నికలకు వర్తింపచేసేలా చట్టంలో సవరణలు చేయడంతో ఈ ప్రభుత్వం మరోసారి బీసీలకు మొండిచేయి చూపింది.

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జీహెచ్ఎంసీ చట్టంలో సవరణలు తెచ్చి బీసీలకు 63 డివిజన్లు కేటాయించి తమ నిజాయతీని నిరూపించుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను కొత్త మున్సిపల్​ చట్టంలో తొలగించి, జీహెచ్​ఎంసీ చట్టంలో అలాగే కొనసాగించడం సరికాదు. రాష్ట్రమంతా ఒక విధానం గ్రేటర్ లో మరో విధానం సరికాదు. ఆ నిబంధనను కూడా తొలగించి ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పొరపాట్లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తప్పులు సరిదిద్ది పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరపడం వల్ల వృద్ధులు, కరోనా పేషెంట్లు, ఎన్నికల సిబ్బందికి ఎంత వరకు బాగుంటుందో ఆలోచించాలి.

గ్రేటర్​ ప్రజల పరిస్థితి దుర్భరం

హైదరాబాద్ ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లటానికి భయపడే పరిస్థితులున్నాయి. సుందరంగా చేస్తామన్న నగరం కాస్తా, అధ్వానంగా మారింది. సీఎం మాత్రం ప్రగతి భవన్ నుంచి తన ఫామ్​  హౌస్ కు వెళ్లడానికి రైతుల భూముల మీదుగా రోడ్లు వేసుకున్నారు. చిన్న వర్షం పడినా రోడ్లన్నీ నిండిపోతున్నాయి. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు ప్రయాణిస్తున్నారు. మునిగిన ఇండ్లలోనే ఉండి ప్రజలు అల్లాడుతుంటే, సహాయక చర్యలు చేపడుతున్న అధికారులను మున్సిపల్ ఎన్నికల పని చూడమని పురమాయించడం టీఆర్ఎస్ అధికార దాహానికి నిదర్శనం. ఇది ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. ప్రస్తుతం మున్సిపల్ సిబ్బంది పరిస్థితి కత్తి మీద సాములా మారింది. ఏక కాలంలో అటు మున్సిపల్ ఎన్నికలకు ఓటర్ల జాబితాలను తయారు చేసి ఎన్నికలు నిర్వహించడం, ఇటు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలను రెడీ చేసి ప్రకటించడం మరో వైపు వరద సహాయక కార్యక్రమాలను చేపట్టడమే కాక రోజువారీ పనులను చేయడంతో వారు తమ పనులకు ఎంత వరకు న్యాయం చేయగలుగుతారో చూడాలి.

ఎందుకీ డ్రామాలు?

మొత్తం ప్రపంచ సంస్థలను హైదరాబాద్ లో దింపుతున్నట్టు కేటీఆర్ చేస్తున్న డ్రామాలను చూస్తూ, మౌలిక వసతులే కల్పించలేని మీకు ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. త్యాగాలు, బలి దానాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు ఎలా పని చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తాము సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబానికి ధారాదత్తం చెయడానికా? అని వాపోతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని అందల మెక్కించడాన్ని గమనిస్తున్నారు. -జి.నిరంజన్, పీసీసీ అధికార ప్రతినిధి.