- అభివృద్ధే మరోసారి పీఠమెక్కిస్తుందంటున్న బీఆర్ఎస్
- సర్కార్‌పై వ్యతిరేకతే అనుకూలమంటున్న కాంగ్రెస్
- సిటీపై కేంద్ర ప్రభుత్వ ముద్ర ఉందంటున్న బీజేపీ
- మైనార్టీ ఓటర్లంతా తమ వైపేనంటున్న మజ్లిస్
హైదరాబాద్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి అధిక సీట్లను గెలుచుకుని పట్టు నిలుపుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు రెడీ అయ్యాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రచారంతో గెలుపు వ్యూహాలకు పదునుపెట్టే పనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు నిమగ్నమయ్యాయి. గ్రేటర్‌పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా దక్కించుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాయి.
సిటీలో చేసిన అభివృద్ధే తమ పార్టీని మరోసారి గెలిపిస్తుందని బీఆర్ఎస్, సర్కార్‌పై పెగిరిన ప్రజావ్యతిరేకతే తమకు కలిసివస్తుందని కాంగ్రెస్, తాము కూడా ఎంతో బలపడ్డామని బీజేపీ, మైనార్టీల ఓటు బ్యాంకు అంతా తమవైపే ఉందని మజ్లిస్.. ఇలా ఆయా పార్టీల నేతలు ఎవరికి వారే ధీమాగా చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఈసారి గ్రేటర్ సిటీలో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. సికింద్రాబాద్, సనత్‌నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, అంబర్‌పేట, ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మహేశ్వరం, కంటోన్మెంట్, మల్కాజిగిరి, పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ఎమ్మెల్యేలు, గోషామహల్‌నుంచి బీజేపీ ఎమ్మెల్యే, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పురా, మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్, బహదూర్ పురా నుంచి మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అభివృద్ధే బలం అంటున్న గులాబీ నేతలు
పదేళ్లలో బీఆర్ఎస్సర్కార్ చేసి అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సిటీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత తమ పార్టీదేనని పేర్కొంటున్నారు. దీంతో మరోసారి ప్రజలు తమనే మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తారనే ఆశతో ఉన్నారు. ముఖ్యంగా ఐటీ రంగ అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం వంటివి తమకు కలిసి వచ్చే అంశాలని అంటున్నారు.
అదేవిధంగా పార్టీని బూత్‌స్థాయి నుంచి పట్టిష్టం చేసుకునేందుకు నేతలు ఇప్పటికే బూత్కమిటీలతో భేటీ అవుతున్నారు. ఓటర్ల జాబితాపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ ఓటు బ్యాంకు చెదరకుండా చూసుకుంటున్నారు. కొత్త ఓటర్ల నమోదుపైనా బీఆర్ఎస్ నేతలు ఫోకస్ పెట్టారు.
తుక్కుగూడ సభతో కాంగ్రెస్‌లో ఫుల్ జోష్
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ నేతలు పలు కార్యక్రమాలతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి వివరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపైనా అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా గ్రేటర్లోబలపడ్డామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తుక్కుగూడ బహిరంగ సభ సక్సెస్‌తో ఆ పార్టీ నేతలు, క్యాడర్ ఫుల్‌జోష్ లో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్‌కు గత వైభవం రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్‌నేత , మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బూత్‌స్థాయి నుంచి పార్టీని పునర్నిస్తున్నామని, ఈసారి ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకుంటామంటున్నారు.
కమలం వికసిస్తుందంటున్న బీజేపీ
గ్రేటర్లో మిగిలిన పార్టీలకంటే బీజేపీ బలంగా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి హైదరాబాద్‌కు ఎన్నో నిధులు ఇచ్చామని, సిటీ అభివృద్ధిలో తమ పార్టీ పాత్ర ఎంతో ఉందని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్సర్కార్ పై ప్రజా వ్యతిరేకతే తమ పార్టీకి అనుకూలంగా మారనుందని అంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండడంతో ఈసారి అధిక సీట్లను గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. ప్రత్యేకించి ఓటు బ్యాంకుపై పూర్తి నమ్మకంతో ఉంది. కేంద్ర పథకాలు, అభివృద్ధి, సామాజికాంశాలు అనుకూలమైనవని కమలం నేతలు భావిస్తున్నారు.
మైనార్టీల ఓటు బ్యాంకుపైనే మజ్లిస్
సిటీలో మైనార్టీలకు అండగా నిలిచేది రక్షణ కల్పించేది తమ పార్టీనే అని మజ్లిస్ ప్రచారం చేసుకుంటున్నది. అధికంగా ఉన్న మైనార్టీ ఓటర్లే తమకు బలమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మజ్లిస్‌కు 7 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఈసారి ఆ సంఖ్యను పెంచుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్, జూబ్లీహిల్స్ స్థానాలపైనా ఆ పార్టీ గురిపెట్టింది. గత ఎన్నికల కంటే ఈసారి తమ బలం మరింతగా పెరిగిందని మజ్లిస్భావిస్తున్నది. మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వాటిని కాపాడుకునేందుకు బూత్కమిటీలను ఏర్పాటు చేసింది.
ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించుకుంటుంది. బీఆర్ఎస్కు మిత్రుడిగా ఉంటూనే వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించుకునేందుకు ఎత్తులు వేస్తున్నది. ఇలా గ్రేటర్‌పరిధిలో నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల పోరులో గెలుపు సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి.