డిసెంబర్‌ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్

దీపావళి అయినంక గ్రేటర్​ నోటిఫికేషన్!

నేడు రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ భేటీ

రేపు ఫైనల్​ ఓటర్​ లిస్టు ప్రకటన

హైదరాబాద్‌‌, వెలుగు: దీపావళి తర్వాత గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఎన్నికల నోటిఫికేషన్‌‌ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఎన్నికల ప్రాసెస్​ను వేగవంతం చేసిన ఎస్‌‌ఈసీ.. గురువారం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్నది. ఎన్నికల నిర్వహణపై ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఈ సమావేశంలో సేకరించనుంది. డిసెంబర్‌‌ మొదటి వారంలోనే పోలింగ్‌‌ పూర్తి చేసేలా వచ్చే వారంలో షెడ్యూల్‌‌ ప్రకటించడానికి రెడీ అవుతున్నది. కాస్త అటూ ఇటూ అయినా డిసెంబర్​ రెండో వారంలో పోలింగ్‌‌ పూర్తి చేసే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.

సవరించిన చట్టంతో ఎన్నికలు

జీహెచ్​ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు ఫిబ్రవరి 11తో ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఎస్‌‌ఈసీని కోరింది. కొత్తగా వార్డుల డీలిమిటేషన్‌‌ చేపట్టడం లేదని, 2016లో ఖరారు చేసిన వార్డుల రిజర్వేషన్‌‌లే ఈ ఎన్నికలకు వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో జీహెచ్‌‌ఎంసీ చట్టానికి సవరణ తెచ్చామని, వాటిని గవర్నర్‌‌ ఆమోదించి గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ ఇచ్చారని పేర్కొంది. ప్రభుత్వం తెచ్చిన సవరణలను అడాప్ట్‌‌ చేసుకున్న ఎస్‌‌ఈసీ మార్చిన నిబంధనల మేరకే ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నది. మున్సిపల్‌‌ చట్టంలో మాదిరిగానే జీహెచ్‌‌ఎంసీ చట్టంలోనూ ఎన్నికల నోటిఫికేషన్‌‌, పోలింగ్‌‌ నిబంధనలను సవరించారు. దీని ప్రకారం.. నోటిఫికేషన్‌‌ జారీ చేసిన నాటినుంచి 15వ రోజు పోలింగ్‌‌ ఉంటుంది.

నేడు రాజకీయ పార్టీలతో భేటీ

గ్రేటర్‌‌ హైదరాబాద్​ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో స్టేట్‌‌ ఎలక్షన్‌‌ కమిషనర్‌‌ పార్థసారథి గురువారం సమావేశం కానున్నారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలతోపాటు ఎస్‌‌ఈసీలో రిజిస్టర్డ్‌‌ అయిన పార్టీల ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించారు. కరోనా వల్ల  ఎన్నికల నిర్వహణలో తెస్తున్న మార్పులు, ప్రభుత్వం సవరించిన చట్టం వివరాలు, ఫేస్‌‌ రికగ్నైజేషన్‌‌ యాప్‌‌, టీ పోల్‌‌ అప్లికేషన్‌‌ ద్వారా నామినేషన్ల దాఖలు.. వృద్ధులు, పోలింగ్‌‌ కేంద్రాలకు రాలేని వారికోసం తెస్తున్న ఈ– ఓటింగ్‌‌ సిస్టం తదితర వివరాలను వివరించనున్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటారు.

రేపు ఫైనల్‌‌ ఓటర్‌‌ లిస్టు

ఈసీ శుక్రవారం ఫైనల్‌‌ ఓటరు లిస్టును ప్రచురించనుంది. ప్రజల అభ్యంతరాలను గురువారం నాటికి పరిశీలించి పరిష్కరిస్తామని ఆఫీసర్లు చెప్పారు. డ్రాఫ్ట్‌‌ ఓటర్‌‌ లిస్టులో 74.04 లక్షల మంది ఓటర్లుండగా తుది ఓటర్ల లిస్టులో సంఖ్య పెరిగే అవకాశముంది. శుక్రవారమే డ్రాఫ్ట్‌‌ పోలింగ్‌‌ స్టేషన్లను ప్రకటించనుంది. వాటిపై ఈ నెల 17 వరకు అభ్యంతరాలను తీసుకొని 18న పరిష్కరించనుంది. పోలింగ్‌‌ స్టేషన్ల డ్రాఫ్ట్‌‌ నోటిఫికేషన్‌‌పై 16న గుర్తింపు పొందిన పార్టీలతో జీహెచ్‌‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు సమావేశమవుతారు. ఈ నెల 21న పోలింగ్‌‌ స్టేషన్ల తుది జాబితాను ప్రకటిస్తారు.

For More News..

దుబ్బాక ఓటమితో జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరపడుతున్న టీఆర్ఎస్

సర్కారు నిర్ణయాలతో గందరగోళం.. మొట్టికాయలు వేసిన హైకోర్టు

హైదరాబాద్​కు ‘స్పుత్నిక్​ V’.. త్వరలో ట్రయల్స్