నెలరోజుల నుంచి పనులకు బ్రేక్​..మళ్లా ఆగిన బయో మైనింగ్

  •     రెండేండ్లు దాటినా సగం కూడా కాని పనులు
  •     గుట్టలుగా పేరుకుపోయిన గార్బెజ్​ 
  •     పరిసరాలు కంపుకొడుతున్నాయని స్థానికుల ఆవేదన

హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ లో చెత్తను ప్రాసెస్​ చేసేందుకు  చేపట్టిన బయో మైనింగ్​ ప్రాజెక్టు కు తరచూ బ్రేకులు పడుతున్నాయి. బడ్జెట్​ సమస్యలతో బయో మైనింగ్​ పనులకు అడ్డంకులు ఏర్పడగా.. ఇప్పుడు మరోసారి పనులు ఆగిపోయాయి. దీంతో డంప్​ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. రోజూ చెత్తను వేసేందుకు జాగా దొరకడం లేదు. దీంతో కొంతమంది ఎస్సార్​ఎస్పీ కెనాల్​, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేస్తున్నారు. దీనివల్ల ఈగలు, దోమలు పెరుగుతున్నాయని జనం చెబుతున్నారు. 

రెండేండ్లు దాటినా సగం కూడా కాలే.. 

కార్పొరేషన్ పరిధిలో రోజుకూ దాదాపు 450 నుంచి 500 టన్నుల చెత్త వెలువడుతోంది. నెలకు సగటున 15 వేల టన్నుల వరకు చెత్త వస్తుంది. స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మడికొండ-రాంపూర్​ గ్రామాల సమీపంలోని జీడబ్ల్యూఎంసీ డంప్​ యార్డుకు తరలిస్తున్నారు. దాదాపు 32 ఎకరాల్లో కొన్నేండ్ల కిందట ఈ డంప్​ యార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందులో 5 లక్షల టన్నులకు పైగా వ్యర్థాలు పోగయ్యాయి. దానికి తగ్గట్టుగా ప్రాసెసింగ్​ ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తేవి. దీంతోనే స్మార్ట్​ సిటీ పథకంలో భాగంగా రూ.37 కోట్ల అంచనా వ్యయంతో డంప్​ యార్డులో బయో మైనింగ్ కు శ్రీకారం చుట్టారు. డంప్​ యార్డులోని 3 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్​ చేసేందుకు పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ 2021 డిసెంబర్​ లో వర్క్స్​ స్టార్ట్ చేసింది. 2022 డిసెంబర్​ లోగానే పనులు కంప్లీట్ చేయాల్సి ఉంది. రకరకాల కారణాలతో దానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. గతేడాది వర్షాలు, నిధులు విడుదలకాకపోవడంతో దాదాపు ఆరు నెలలపాటు పనులు నిలిచిపోయాయి.

ఈ సమయంలోనే అందులో బయో మైనింగ్​ యంత్రాల్లో కొంతమేర సామగ్రి చోరీకి గురైనట్లు తెలిసింది. ఆ తరువాత పనులు తిరిగి ప్రారంభమైనా తరచూ ఆగుతూ సాగుతున్నాయి. నెలనెలా సుమారు గా 12 వేల టన్నుల చొప్పున చెత్తను ప్రాసెస్​ చేయాల్సి ఉండగా.. ఇటీవల వర్షాలకు మళ్లీ బయో మైనింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇప్పటివరకు లక్ష టన్నులకుపైగా చెత్తను ప్రాసెస్​ చేశారు. దాదాపు నెల రోజుల నుంచి పనులు ఆగిపోయాయి. బయో మైనింగ్​ ప్రక్రియ పూర్తయితే దాని స్థానంలో మిగతా చెత్తను వేసేందుకు అవకాశం ఉండేది. కానీ రెండేండ్లు దాటినా పనులు సగం కూడా పూర్తికాకపోవడంతో రోజువారీగా పోగవుతున్న చెత్తతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

ఓపెన్​ ప్లేసుల్లో డంపింగ్​

దాదాపు 11 లక్షల జనాభా ఉన్న ఓరుగల్లు నగరానికి నాలుగు దిక్కులా డంప్​ యార్డులు ఏర్పాటు చేయాలనే ప్రపోజల్స్​ ఉన్నాయి. ఆఫీసర్ల ప్రయత్నాలకు స్థానికులు వ్యతిరేకించారు. దీంతో ఇంత పెద్ద సిటీకి మడికొండ డంప్​ యార్డు మాత్రమే దిక్కయింది. అక్కడ సామర్థ్యానికి మించి వ్యర్థాలు పోగవగా.. చెత్త వేసేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతోనే రోజువారీగా చెత్తను కలెక్ట్ చేయాల్సింది పోయి.. రెండు, మూడు రోజులకోసారి చెత్తను సేకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిటీ పరిస్థితి ఇలా ఉండగా.. గ్రేటర్​ విలీన గ్రామాల్లో ఐదారు రోజులకోసారిగానీ చెత్త సేకరణ జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఓ వైపు డంప్​ యార్డు నిండి పోవడం, మరోవైపు వెలువడుతున్న కొత్త చెత్తను డంప్​ చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుండటంతో కొంతమంది ఎస్సార్​ ఎస్పీ కెనాల్​ గట్లు, ఓపెన్​ ప్లేసులు, నగర శివారుల్లోని చెరువుల వద్ద చెత్తను డంప్​ చేస్తున్నారు. దీంతో ఆయా పరిసరాలు డంప్​ యార్డులను తలపిస్తున్నాయి.

ఇబ్బందులు పడుతున్న జనాలు

గుట్టలుగా పేరుకుపోయిన చెత్త నుంచి వచ్చే వాసన, ఈగలు, దోమలతో ఇప్పటికే మడికొండ, రాంపూర్​ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లీడర్లు, ఆఫీసర్లు చొరవ తీసుకుని చెత్తను ఓపెన్​ ప్లేసుల్లో డంప్​ చేయకుండా చర్యలు తీసుకోవడం తో పాటు రోజువారీగా వెలువడుతున్న చెత్తకు తగిన పరిష్కారం చూపాలని గ్రేటర్​ ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

దోమలతో ఇబ్బంది పడుతున్నం

ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఎస్సార్​ఎస్పీ భూములు మొత్తం డంప్​ యార్డుగా మారుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న హోటళ్లు, చికెన్ సెంటర్లు, ఇండ్లకు సంబంధించిన వ్యర్ధాలను మున్సిపల్​ ట్రాక్టర్లతో తీసుకొచ్చి కెనాల్​ పక్కనే డంప్​ చేస్తున్నారు. దీంతో దోమలు, ఈగలు పెరిగి ఇబ్బందులు పడుతున్నాం. ఇలా ఓపెన్​ ప్లేసుల్లో చెత్తను పడేయకుండా లీడర్లు, ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలి. 

- గోవిందుల ఉపేందర్, నారాయణ నగర్, ఎర్రగట్టు గుట్ట