కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: ఇందిరా మహిళా శక్తి పథకం లక్ష్యాన్ని చేరుకోవాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి మేయర్ బ్యాంకర్లు, మెప్మా అధికారులతో ఇందిరా మహిళా శక్తి పథకం యూనిట్ల లక్ష్యం, బ్యాంక్ లింకేజీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టారని, బ్యాంకర్లు జాప్యం చేయకుండా విరివిగా రుణాలు అందించాలని మేయర్ కోరారు.
అనంతరం ట్రేడ్ లైస్సెన్ల జారీ లక్ష్యాన్ని సాధించాలని బల్దియా ఆఫీసర్లకు మేయర్, కమిషనర్ సూచించారు. అనంతరం గ్రేటర్పరిధిలోని 66 డివిజన్లకు చెందిన వార్డు అధికారులతో ఎల్ఆర్ఎస్దరఖాస్తుల పరిశీలనపై సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో సుమారు 80 వేల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాలోల సంబంధిత అధికారులు తదితరులున్నారు.