
- నయీంనగర్ నాలా విస్తరణ 82 ఫీట్లకు కుదింపు
- మొదట 100 ఫీట్లు విస్తరించాలని ఆఫీసర్ల నిర్ణయం
- లీడర్ల ప్రెజర్‌తో వెడల్పు తగ్గించిన అధికారులు
- మార్కింగ్ వరకు వారం రోజుల్లో కూల్చివేసుకోవాలని ఆదేశాలు
హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాల విస్తరణకు అడ్డంకులు తప్పడం లేదు. ఆక్రమణలతో నాలాలు ఇరుకుగా మారడంతో వరదతో కాలనీలు నీట మునుగుతున్నాయి. దీంతో ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. కానీ బఫర్ జోన్లను పట్టించుకోకుండా ఇండ్లు కట్టిన వారికి అధికార పార్టీ లీడర్ల సపోర్ట్ ఉండడంతో ఆఫీసర్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. హనుమకొండలోని నయీంనగర్ నాలాను 100 ఫీట్ల మేర విస్తరించాలని మొదట నిర్ణయించినప్పటికీ పొలిటికల్ లీడర్ల ప్రెజర్ పెరగడంతో నాలా వెడల్పును 82 ఫీట్లకు కుదించారు. నాలాలను ఆనుకుని ఉన్న ఇండ్లకు మార్కింగ్ చేసి వారం రోజుల్లో కూల్చివేత పనులు పూర్తిచేసుకోవాలని సూచించారు. అయితే నాలాలను డెవలప్ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన లీడర్లే ఆక్రమణదారులకు సపోర్ట్ చేయడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
బఫర్ జోన్ మొత్తం కబ్జాలోనే..
గ్రేటర్ వరంగల్‌లో ప్రధాన నాలాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. నయీంనగర్, భద్రకాళి, బొందివాగు నాలాల చుట్టూ ఎన్‌క్రోచ్‌మెంట్స్‌తో సహా కుచించుపోగా, బఫర్‌జోన్‌లో ఇండ్లు, అపార్ట్‌మెంట్లు వెలిశాయి. మూడేండ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు నగరం మొత్తం నీట మునగడానికి నాలాల ఆక్రమణలే కారణమని తేల్చారు. కానీ అక్రమ నిర్మాణాల్లో చాలా వరకు అధికార పార్టీ లీడర్లు, వారి అనుచరులే కావడంతో కూల్చివేతల అంశాన్ని మూడేండ్ల నుంచి నాన్చుతూ వచ్చారు.
ఇటీవల కురిసిన వర్షాలకు వందకుపైగా కాలనీలు మరోసారి నీట మునిగాయి. దీంతో ఆఫీసర్లు తప్పనిసరి పరిస్థితుల్లో నాలాల ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టారు. మొదటగా నయీంనగర్ నాలా ఆక్రమణల తొలగింపు స్టార్ట్ చేశారు. వాస్తవానికి ఈ నాలా వంద ఫీట్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 43 ఫీట్లు మాత్రమే ఉంది. వడ్డేపల్లి చెరువు నుంచి జవహర్ కాలనీ, పరిమళకాలనీ, సమ్మయ్యనగర్, ఇంజినీర్స్ కాలనీ, ప్రెసిడెన్సీ స్కూల్నుంచి రాజాజీనగర్, నయీంనగర్, పెగడపల్లి డబ్బాల మీదుగా వెళ్లాల్సిన ఈ నాలా పొడవునా వందల సంఖ్యలో ఆక్రమణలు ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం నయీంనగర్ బ్రిడ్జి నుంచి రాజాజీనగర్ బ్రిడ్జి వరకు 1.5 కిలోమీటర్ల మేర కూల్చివేతలు ప్రారంభించారు.
మిగతా వాటికి మోక్షమెన్నడో...
నయీంనగర్ నాలా వద్ద ఆక్రమణలు కూల్చివేస్తున్న ఆఫీసర్లు మిగతా నాలాలపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్ మునకకు కారణమయ్యే బొందివాగు నాలా డెవలప్‌మెంట్ పనులు చేపట్టడం లేదు. సుమారు రూ.156 కోట్లతో ప్రపోజల్స్ పంపి ఏండ్లు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు. దీంతో పాటు నగరంలోని మిగతా నాలాల ఆక్రమణలపై కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల నాలాల మీదనే ఇండ్లు కట్టుకోగా, మరికొందరు బార్లు, హోటళ్లు పెట్టి నడిపిస్తున్నారు. వీరందరికీ లీడర్ల మద్దతు ఉండడం వల్లే ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి అన్ని నాలాల ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
లీడర్ల ప్రెజర్‌తో వెడల్పు కుదింపు
నయీంనగర్ నాలా బఫర్ జోన్‌లోనే వందలాది అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో అధికార పార్టీ నేతలకు సంబంధించినవి కూడా ఉండటంతో ఆఫీసర్లపై ప్రెజర్ ఎక్కువైంది. దీంతో నయీంనగర్బ్రిడ్జి నుంచి రాజాజీనగర్బ్రిడ్జి మార్గంలో నాలా విస్తరణను 100 ఫీట్లకు బదులు 82 ఫీట్లకే కుదించారు. ఈ మేరకు ఆఫీసర్లు మార్కింగ్ చేశారు. నయీంనగర్ బ్రిడ్జికి సమీపంలో నాలా బఫర్‌జోన్‌లోనే ఓ వ్య్తి అపార్ట్‌మెంట్ కట్టారు.
మార్కింగ్ ప్రకారం సిటీ డిప్యూటీ ప్లానర్ ప్రకాశ్‌రెడ్డి, బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్ రాజునాయక్ ఆధ్వర్యంలో కూల్చివేతలకు వెళ్లగా ఒత్తిళ్లు, పైరవీలు మొదలయ్యాయి. వెడల్పును కుదించినప్పటికీ ఆఫీసర్లకు ఒత్తిళ్లు తప్పడం లేదని సమాచారం. అయితే ఇప్పటికే చేసిన మార్కింగ్ ప్రకారం ఇండ్లను కూలగొట్టుకునేందుకు వారం రోజుల టైం ఇచ్చారు. కొత్తగా ఇల్లు కట్టాలనుకునే వాళ్లు నాలా నుంచి సుమారు మూడు మీటర్ల బఫర్ జోన్, మరో రెండు మీటర్ల వరకు సెట్‌బ్యాక్ ఇవ్వాలని ఆఫీసర్లు సూచించారు.