- భారీ వర్షాలకు నిండుకుండల్లా చెరువులు
- భద్రకాళి చెరువుకు గండి పడటంతో జనాల్లో భయం భయం
- ప్రమాదకర స్థితిలో వడ్డేపల్లి, గోపాలపూర్ తటాకాలు
- కోతకు గురై తెగే స్థితికి చేరిన కట్టలు
- సిటీ చుట్టూ ఉన్న అన్ని చెరువులదీ ఇదే పరిస్థితి
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లో చెరువుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే భద్రకాళి చెరువుకు గండి పడగా, నగరంలోని మరికొన్ని చెరువుల పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది. సిటీలో ప్రధానమైన వడ్డేపల్లి, గోపాలపూర్ చెరువులతో పాటు మరికొన్నింటితో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఈ రెండు చెరువులు కోతకు గురవగా.. భారీ వర్షాల నేపథ్యంలో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు. కానీ, మరోసారి వర్షాలు దంచి కొడితే ఈ రెండు చెరువులు తెగిపోయే ప్రమాదం ఉంది. అదేగానీ జరిగితే వేలాది ఇండ్లు జలమయమవడమే కాకుండా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే, చెరువుల అభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నా కట్టలు ప్రమాదంలో పడడంపై జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు తెగితే తమ సంగతి ఏమిటని వణికిపోతున్నారు.
భద్రకాళి కట్టను పట్టించుకుంటలేరు
వరంగల్ భద్రకాళి చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు రెండు విడతలుగా దాదాపు రూ.95 కోట్లతో పనులు చేపట్టారు. ఫస్ట్ ఫేజ్‌లో 1.1 కిలోమీటర్లను రూ.30 కోట్లతో డెవలప్ చేశారు. సెకండ్‌ఫేజ్ లో 2.5 కిలోమీటర్లను స్మార్ట్‌సిటీ ఫండ్స్రూ.65 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఓ వైపు పనులు నడుస్తుండగానే.. మరోవైపు ఫెన్సింగ్ దిమ్మెలు కూలుతున్నాయి. కట్ట తెగకుండా చర్యలు తీసుకోకపోవడంతో శనివారం భద్రకాళి చెరువుకు గండిపడింది. ఆఫీసర్లు అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పోతననగర్, రామన్నపేట, కాపువాడ, సరస్వతినగర్ ప్రాంతాలను వరద ముంచెత్తేది.
వడ్డేపల్లి తెగితే అంతే..
హనుమకొండ ప్రాంతానికి గుండెకాయలా ఉన్న వడ్డేపల్లి చెరువు కూడా ప్రమాదంలో చిక్కుకుంది. తాజా వర్షాలకు ఈ కట్ట ప్రశాంత్ నగర్ వైపు రెండు, మూడు చోట్ల దెబ్బతింది. దాదాపు 581 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కెపాసిటీ 90 మిలియన్ క్యూబిక్ ఫీట్లు కాగా..మడికొండ, సోమిడి, ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వరదతో పూర్తిగా నిండింది. ఈ చెరువు నుంచి వచ్చిన వరదతోనే నయీంనగర్ నాలా ఉప్పొంగి పదుల సంఖ్యలో కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒకవేళ ఈ చెరువు కట్ట తెగితే సమీపంలోని ప్రశాంత్‌నగర్ నుంచి మొదలుకుంటే వరంగల్ నిట్ ఏరియాతో పాటు హనుమకొండ, వడ్డేపల్లి, సుబేదారి ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉంది. వడ్డేపల్లి చెరువు కట్టను పునరుద్ధరించడంతో పాటు మినీ ట్యాంక్ బండ్‌గా డెవలప్ చేసేందుకు మంత్రి కేటీఆర్2021 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేశారు. రూ.21.5 కోట్లతో పనులు చేపట్టగా అవి ఇంకా కొనసాగుతున్నాయి. కట్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా కాంట్రాక్టర్లు లైట్ తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. కాగా కట్ట కోతకు గురై ప్రమాదం పొంచి ఉండడంతో ఆఫీసర్లు అలర్టయ్యారు. కోతకు గురైన చోట్ల టెంపరరీ రిలీఫ్ కోసం మట్టి సంచులు నింపారు. కానీ, మరోసారి గట్టివాన పడితే ఈ కట్ట పూర్తిగా కోతకు గురయ్యే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదంలో గోపాలపూర్ చెరువు
హనుమకొండ గోపాలపూర్, సమ్మయ్యనగర్, అమరావతి నగర్తదితర కాలనీలను ఆనుకొని ఉన్న గోపాలపురం ఊర చెరువు కూడా కొంతమేర దెబ్బతింది. 20 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు కబ్జాలతో 10 ఎకరాలకే పరిమితం కాగా.. దీనిని ఎప్పటినుంచో శిల్పారామంగా, మినీ ట్యాంక్ బండ్‌గా డెవలప్ చేయాలనే డిమాండ్ ఉంది. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల సమయంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే కలిసి రూ.2.45 కోట్లతో శిలాఫలకం కూడా వేశారు. కానీ పనులు షురూ కాక కట్టను కూడా పట్టించుకునే నాథేడే లేకుండా పోయాడు. దీంతో రెండు రోజుల కింద వరదకు వంద ఫీట్ల రోడ్డు వద్ద సగం వరకు కోతకు గురైంది. స్థానికులు ఇసుక సంచులు అడ్డుగా వేయడంతో తాత్కాలికంగా ప్రమాదం తప్పింది. ఈ కట్ట పూర్తిగా కోతకు గురైతే అమరావతినగర్ నుంచి సమ్మయ్యనగర్, కాకతీయ యూనివర్సిటీ, టీవీ టవర్ కాలనీ, గాంధీ నగర్, నయీంనగర్ ఏరియా మొత్తం కొట్టుకుపోయే ప్రమాదముంది.
కట్టలు తెగితే పెనుప్రమాదమే
నగరం చుట్టూరా ఉన్న మరికొన్ని చెరువుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికే మడికొండలోని కొత్తకుంట చెరువు తెగగా.. ఆ వరద వడ్డేపల్లికి చేరి, నయీంనగర్ చుట్టూరా ఉన్న లోతట్టు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. కాగా చెరువులను డెవలప్ చేసేందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం..కట్టల పరిస్థితిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతోనే కట్టలు కోతకు గురవుతున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా లీడర్లు, ఆఫీసర్లు మేల్కొనకపోతే మున్ముందు చెరువులతో పెను ముప్పు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.