వరంగల్, వెలుగు :గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రధాన గొలుసుకట్టు చెరువులు, నాలాలను పలువురు లీడర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించడంతో నగరం మరోసారి నీట మునిగింది. వరంగల్ ట్రైసిటీలో సుమారు 40 కాలనీలు నీటమునుగగా ఇందులో 25 కాలనీలు తూర్పు నియోజకవర్గంలోనే ఉన్నాయి. గ్రేటర్ వరంగల్‌లో ప్రధానంగా భద్రకాళి చెరువు, దేశాయిపేట వడ్డేపల్లి, బంధం, బెస్తం, చిన్న వడ్డేపల్లి, గోపాలపూర్, రంగసముద్రం, ములుగురోడ్ కోట చెరువు, హంటర్‍రోడ్ శాయంపేట కోటి చెరువు, గొర్రెకుంట కట్ట మల్లన్న వంటి చెరువులు పదుల సంఖ్యలో ఉన్నాయి.
Also Read:-ఆక్రమణలే కొంప ముంచినయ్
వీటి పరిధిలో సుమారు 250 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. కొందరు అక్రమార్కులు చెరువు భూములకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రజలకు అమ్మేశారు. భద్రకాళి చెరువు సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా 60 ఎకరాలు, ములుగురోడ్‍కోట చెరువు 120 ఎకరాల్లో ఉండగా 30 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అలాగే 100 ఎకరాల్లో ఉండే చిన్న వడ్డేపల్లి చెరువులో 30 ఎకరాలు కబ్జాల పాలైంది.
బంధం చెరువు పరిధిలో కొన్ని చోట్ల పేదలు గుడిసెలు వేసుకోగా మరో 25 నుంచి 30 ఎకరాలను లీడర్ల ముసుగులో కొందరు వ్యక్తులు కబ్జా పెట్టారు. గోపాలపూర్ చెరువు ఆకారం కోల్పోగా, పోచమ్మకుంట చెరువు స్థలాన్ని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అనుచరులు ప్లాట్లుగా మార్చి అమ్మేశారు.
భద్రకాళి చెరువు కబ్జాల విలువ రూ.1,452 కోట్లు
గ్రేటర్ సిటీలో ప్రధాన చెరువులు, వాటికి అనుబంధంగా ఉన్న గొలుసు చెరువులు 20 వరకు కబ్జాలో ఉండగా.. ఒక్క భద్రకాళి చెరువు స్థలాల ఆక్రమణల విలువే సుమారు 1,452 కోట్లు అని తెలుస్తోంది. సిటీ మధ్యలో ఉండే ఈ చెరువుకు ఓ వైపు భద్రకాళి బండ్‌తో పాటు పలు కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో భద్రకాళి చెరువు సుమారు 60 ఎకరాలు కబ్జా అయింది. కబ్జా చేసిన వారిలో ఎక్కువగా గత ప్రభుత్వంలో లీడర్లుగా చలామణి అయిన వారితో పాటు, పలువురు బడా వ్యాపారవేత్తలు ఉన్నారు.