వరదకి అడ్డంగా మారిన కరెంట్ పోల్స్

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్​లో వరద ప్రవాహానికి తగ్గట్టుగా డ్రైనేజీ వ్యవస్థ లేదు. చాలా ఏరియాల్లో ఇరుకు నాలాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు డ్రేనేజీలు, నాలాల మధ్యలో వేసిన కరెంట్ స్తంభాల వల్ల కొత్త సమస్య వస్తున్నాయి. చిన్న వర్షానికే నాలాలు పొంగిపొర్లుతుండగా.. నాలాల్లో పోల్స్​ వరదకు అడ్డంకిగా మారుతున్నాయి. ఇటీవల పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలో తిరిగిన లీడర్లు, ఆఫీసర్లు వరదకు అడ్డంగా ఉన్న పోల్స్​ను గుర్తించి వాటిని మార్చాలని నిర్ణయించినా ... యాక్షన్​మాత్రం తీసుకోలేదు. దీంతో వరదతో పాటు వచ్చే చెత్తాచెదారం స్తంభాల దగ్గర చిక్కుకుని వర్షపు నీళ్లన్నీ లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. 

అసలే ఇరుకు.. ఆపై స్తంభాలు

వరంగల్ సిటీలో 2.5 లక్షల ఇండ్లు, దాదాపు 11 లక్షల జనాభా ఉంటుంది. సిటీలో 54 కిలోమీటర్ల ప్రధాన నాలాలు , 1,440 కిలోమీటర్ల ఇంటర్నల్​ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఎప్పుడో ఈ నాలాలను నిర్మించడంవల్ల ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మురుగునీటిని, వరద నీటిని తట్టుకోవడంలేదు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండే ఏరియాల్లో చాలాచోట్ల కాల్వల్లోనే కరెంట్​ పోల్స్​ ఉన్నాయి.  కాశీబుగ్గ, ప్రతాపనగర్​, క్రిస్టియన్​ కాలనీ, గాంధీనగర్​, తిలక్​ రోడ్డు, ఎల్ బీ నగర్​, పద్మానగర్​, సాయిగణేశ్​ కాలనీ, హనుమకొండ గోపాలపూర్, అశోక కాలనీ, తిరుమల బార్​ జంక్షన్​, గోకుల్ నగర్​ తదితర  స్లమ్​ ఏరియాల్లో కూడా నాలాల్లోనే పోల్స్ వేశారు. ప్రతి  డివిజన్​లో కనీసం రెండు, మూడు పోల్స్​ అయినా కాల్వల్లో ఉన్నాయి. వర్షాలు పడిన ప్రతిసారీ నాలాల మధ్యలో ఉన్న స్తంభాలతో ఇబ్బంది కలుగుతోంది. ఈ విషయాన్ని ప్రజలు, కార్పొరేటర్లు చాలాసార్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది  పట్టణ ప్రగతి కార్యక్రమంలో పూర్తిగా పాడైన పోల్స్​తో పాటు  డ్రైన్ల మధ్యలో ఉన్నవాటినీ ఆఫీసర్లు గుర్తించారు. సిటీలో మొత్తం 400 వరకు పోల్స్​తొలగించవలసి ఉంటుందని, ఇందులో 110 పోల్స్​ నాలాల మధ్యలో ఉన్నట్లు గుర్తించారు. వాటిని మార్చేందుకు ప్లాన్​ రెడీ చేసినా ఫలితం లేదు. ఈసారి కూడా  పట్టణ ప్రగతిలో పోల్స్​ ఇష్యూను కార్పొరేటర్లు లేవనెత్తారు. గ్రేటర్​, విద్యుత్​ డిపార్ట్​మెంట్ల మధ్య కోఆర్డినేషన్​లేకపోవడం వల్లే ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని అంటున్నారు.  కరెంట్ పోల్​ను షిఫ్ట్ చేయాలంటే లేబర్​ ఛార్జ్​, మెటీరియల్​ కాస్ట్​ కింద ఒక్కోదానికి  రూ.7 వేలు గ్రేటర్​ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్​ మెంట్​ కు చెల్లించాలి.  పోల్స్​ మార్చేపని ఎలక్ట్రిసిటీ డిపార్ట్​ మెంట్​ వాళ్లే  చేపట్టాలని  గ్రేటర్​ ఆఫీసర్లు చెప్తుంటే.. జీడబ్ల్యూఎంసీ నుంచి షిఫ్టింగ్​చార్జీలు కట్టాల్సిందేనని  ఎన్​పీడీసీఎల్​ ఆఫీసర్లు అంటున్నారు. రెండు డిపార్ట్​ మెంట్ల మధ్య సమన్వయం కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రయత్నించడంలేదు. 

నిరుడే లిస్ట్​ ఇచ్చినం

ప్రమాదకరంగా ఉన్నవాటితో పాటు  కాల్వల్లో ఉన్న స్తంభాల లిస్ట్​ గత ఏడాదే ఎలక్ట్రిసిటీ వారికి  ఇచ్చినం. ఎక్కడెక్కడ స్తంభాలను షిఫ్ట్​ చేయాలో చెప్పాం. దాని ప్రకారం వాళ్లే యాక్షన్​ తీసుకోవాల్సి ఉంది. గ్రేటర్​ పరిధిలో అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్న వాటికి మాత్రమే జీడబ్ల్యూఎంసీ నుంచి డబ్బులు కడతాం. పట్టణ ప్రగతి పనులకు చార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. 
– సత్యనారాయణ, ఎస్​ఈ, జీడబ్ల్యూఎంసీ