
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ కు ముంపు సమస్య తొలగడం లేదు. చిన్న వర్షానికే లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. వారం, పదిరోజుల పాటు జనాలు నీళ్లలోనే ఉండాల్సి వస్తోంది. వర్షాలుపడ్డ ప్రతిసారీ ఇదే పరిస్థితి ఉన్నా.. అధికారులు, లీడర్లు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. లోతట్టు ప్రాంతాల కోసం ఇప్పటికి ఒక్క రూపాయీ ఖర్చు పెట్టలేదు. కొన్ని రోజుల్లోనే వానకాలం మొదలవుతుండగా.. మళ్లీ ఎన్ని కాలనీలు మునుగుతాయో, ఎన్ని అవస్థలు పడాలో అని స్థానికులు జంకుతున్నారు.
వారం, పదిరోజులు నీళ్లల్లనే
గ్రేటర్ వరంగల్ దాదాపు 1,450 కాలనీలు ఉన్నాయి. దాదాపు 700 కాలనీల్లో సరిగ్గా డ్రైనేజీలు లేవు. వీటిల్లో ఎక్కువ లోతట్టు ప్రాంతాలే. పైనుంచి వచ్చే వరద చాలా కాలనీల్లోకి చేరుతుండగా.. అక్కడి నుంచి నీళ్లు బయటకు వెళ్లేందుకు సరైన మార్గాలు లేవు. ముఖ్యంగా వరంగల్ ఏనుమాముల సమీపంలోని ఎస్ఆర్ నగర్, సాయి గణేశ్ కాలనీ, వివేకానంద కాలనీ, ఆ చుట్టు పక్కల ప్రాంతాలు చిన్నవాన పడినా ముంపునకు గురవుతున్నాయి. వీటితో పాటు శివనగర్, సంతోషిమాత టెంపుల్ లేన్, ఎన్టీఆర్ నగర్, హనుమకొండలో అశోక కాలనీ, గోకుల్ నగర్, లోకల్ బస్ డిపో ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి. గత నెలలో కురిసిన వర్షాలకు కూడా ఇక్కడి కాలనీలు నీట మునగగా.. ఎస్ఆర్ నగర్, సాయిగణేశ్ కాలనీ, వివేకానంద కాలనీ తదితర చోట్ల ఇప్పటికీ వరద నీళ్లు బయటకు వెళ్లక ఇండ్ల మధ్యనే నిలిచి ఉండటం గమనార్హం.
పైసా పని చేస్తలేరు
2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు నగరం మొత్తం అతలాకుతలం అయింది. ముంపు నివారణకు చర్యలు కోసం 2021 లో ఫీల్డ్ విజిట్ చేసి, నీట మునుగుతున్న 138 లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. ఇందులో కాజీపేట సర్కిల్ పరిధిలో 86, వరంగల్ సర్కిల్ పరిధిలో మరో 52 ప్రాంతాలున్నట్లు తేల్చారు. ఒకట్రెండు చోట్ల తప్ప ముంపు నివారణకు పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎస్ఆర్ నగర్, సాయిగణేశ్ కాలనీ లో ఇరుకు నాళాలతో వరద ఔట్ ఫ్లో కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ మార్గంలోనే వరంగల్ లేబర్ కాలనీ నుంచి సీకేఎం కాలేజీ వరకు రూ.38 కోట్లతో స్మార్ట్ రోడ్డు నిర్మిస్తున్నారు. కాగా రోడ్డు పక్కన డ్రైన్లు ఏర్పాటు చేస్తే ఈ రెండు ఏరియాలకు ముంపు బాధ తీరే అవకాశం ఉంది. ఈ మేరకు స్మార్ట్ రోడ్డు పనుల్లో భాగంగా డ్రైన్లు నిర్మించేందుకు పైపులు కూడా తెప్పించారు. కానీ కాంట్రాక్టర్కు బిల్లులు రాని కారణంగా పైపులు తెచ్చి రోడ్డు మీదే పెట్టి వదిలేశారు. దీంతో వరద నీటిని మళ్లించే ఏర్పాట్లు లేకుండా పోయాయి. ఫలితంగా ఇప్పుడు వానాకాలంలో కూడా అక్కడి ప్రజలు నీళ్లలోనే బతుకీడ్చాల్సిన పరిస్థితి నెలకొంది.
పాములు, తేళ్లతో ఇబ్బందులు
వానలు పడిన ప్రతిసారి ఇండ్లలోని బియ్యం, బట్టలు, ఇతర సామగ్రి తడిసి జనం అవస్థలు పడుతున్నారు. ఇండ్లలోకి చేరిన నీళ్లు తగ్గకపోవడం, పాములు, తేళ్లు, కప్పలతో నరకం చూస్తున్నారు. స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ ఆఫీసర్లకు విన్నివించినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇకనైనా వర్షాలు ప్రారంభం కాకముందే ముంపు ముప్పు వాటిల్లకుండా అవసరమైన చోట్ల డ్రైన్లు, కల్వర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
12 ఏండ్ల నుంచి నరకం చూస్తున్నం
వరద నీళ్లతోటి 12 ఏండ్ల నుంచి నరకం చూస్తున్నం. లీడర్లు ఎలక్షన్ ముందు వచ్చి హామీలు ఇచ్చి పోతున్నరు తప్ప.. ఆ తరువాత తొంగి కూడా చూస్తలేరు. ఇప్పటికే నాలుగైదు సార్లు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినం. అయినా ఇంతవరకు ఆఫీసర్లుగానీ, లీడర్లు గానీ కనీసం మా బాధ చూడటానికి రాలేదు. ఏటా వానాకాలం వచ్చిందంటే ఇండ్లు విడిచిపోవాల్సి వస్తాంది. ముంపు లేకుండా చూడాలి
– బూస మహేశ్, వివేకానంద కాలనీ
పది రోజులు నీళ్లల్లనే ..
వర్షాలు ఎప్పుడు పడినా దాదాపు 10 రోజులపాటు మా కాలనీ నుంచి నీళ్లు బయటకు పోతలేవు. ఇండ్లన్నీ మునిగి ఉండేసరికి పాములు, తేళ్లు వస్తున్నయ్. కనీసం బాత్ రూంకు వెళ్దామన్నా మస్తు ఇబ్బంది అయితాంది. నీళ్లన్నీ పోయే దాకా నరకం చూడాల్సి వస్తాంది. ఎవరికి చెప్పుకున్నా మా బాధను పట్టించుకుంటలేరు.
– కొండమీది సుజాత, సాయిగణేశ్ కాలనీ