గ్రేటర్‍ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్​లో రూ.91 కోట్ల పన్నులు వసూలు

గ్రేటర్‍ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్​లో రూ.91 కోట్ల పన్నులు వసూలు
  • రూ.117 కోట్ల 51 లక్షల టార్గెట్​లో 77 శాతం కలెక్షన్‍ 
  • 90 శాతం వన్‍ టైం సెటిల్మెంట్‍తో  పెరిగిన వసూళ్లు 
  • ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీల్లోనూ సంతోషకర వసూళ్లు

వరంగల్, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్ కార్పొరేషన్​లో ఈ ఏడాది పన్నుల వసూళ్లు పెరిగాయి. 2024_25 ఏడాదికిగానూ రూ.117 కోట్ల 51 లక్షలు డిమాండ్‍ ఉండగా, మార్చి 31 నాటికి రూ.91 కోట్లు వసూలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది చివరిలో పన్నులపై వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వడానికితోడు ఆఫీసర్లు, సిబ్బంది ఛాలెంజ్‍గా ముందుకెళ్లడంతో ట్యాక్స్​ వసూళ్లు భారీగా జరిగాయి.కాగా, జీడబ్ల్యూఎంసీకి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు రావాలంటే రూ.82 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, అంతకన్నా రూ.9 కోట్లు ఎక్కువ వసూలు చేయడంలో సక్సెస్‍ అయ్యారు. ఉమ్మడి వరంగల్‍ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో సైతం ఇదే తరహాలో పన్నుల వసూలు జరిగింది. 

గతేడాది 65 శాతం.. ఇప్పుడు 77 శాతం

గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍లో అధికారులు ఈసారి దాదాపు 77 శాతం పన్నులను వసూలు చేశారు. 2023_24 ఏడాదికిగానూ బల్దియా టార్గెట్‍ రూ.97 కోట్ల 66 లక్షలు కాగా, రూ.63 కోట్ల 96 లక్షలు వసూలు చేశారు. ఈసారి రూ.117 కోట్ల 51 లక్షలు టార్గెట్‍ ఉండగా, రూ.91 కోట్లు వసూలు కావడంతో గతంలో కంటే మరో 12 శాతం మెరుగైన కలెక్షన్స్​ జరిగాయి.

షాపులకు తాళాలు.. ఆఫీసర్లకు నోటీసులు

టాక్స్​ వసూళ్లలో ఒత్తిడితో బల్దియా ఆఫీసర్లు ఈసారి కొంత కఠినంగా వ్యవహరించారు. 66 డివిజన్లను డిప్యూటీ కమిషనర్ల నుంచి వార్డు ఆఫీసర్ల వరకు విభజించారు. ఏరియాల్లో తిరుగుతూ మొదట రెడ్‍ నోటీసులు జారీ చేశారు. ఆపై మొండి బకాయిలు, టాక్స్ ఆధారంగా ఆస్తుల జప్తు మొదలుపెట్టారు. బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, ఇనిస్టిట్యూషన్లు వంటి దాదాపు 800 పైగా కమర్షియల్‍ బకాయిదారుల దుకాణాలకు తాళాలు వేశారు. ఫర్నిచర్, ఖరీదు చేసే వస్తువులను జప్తుచేశారు. కాగా, మున్సిపల్‍ కమిషనర్‍ అశ్విని తానాజీ వాఖాడే సైతం వసూళ్లపై స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. ఆఫీసర్లు, సిబ్బందికి నోటీసులు అందించడంతో ట్యాక్స్​ వసూళ్లలో సీరియస్‍నెస్‍ పెంచారు.   

కలిసొచ్చిన ఓటీఎస్‍ రాయితీ.. 

అధికారులు మార్చి 12 నాటికి  కేవలం సగానికంటే తక్కువగా 49.40 శాతంగా రూ.58 కోట్ల 32 లక్షల 97 వేలు మాత్రమే వసూలు చేశారు. సెలవు దినాలు తీసేస్తే.. మిగిలిన 14 రోజుల్లో రూ.59 కోట్ల 75 లక్షల 12 వేలు అసలు, మరో రూ.15 కోట్ల ఏరియాలు కలిపి మొత్తంగా రూ.74 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి 90 శాతం రాయితీపై అసెంబ్లీలో లేవనెత్తిన అంశం వసూళ్లకు ప్లస్‍ అయ్యిందనే చెప్పాలి. ఇన్నాళ్లు కేవలం హైదరాబాద్‍ జీహెచ్‍ఎంసీ వరకే ఉన్న వన్‍ టైం సెటిల్‍మెంట్‍ గ్రేటర్‍ వరంగల్‍తోపాటు మున్సిపాలిటీల్లోనూ అమలు చేయాలని కోరడం, దానికి ప్రభుత్వం వెంటనే ఓకే చెబుతూ జీవో ఉత్తర్వులు ఇవ్వడంతో వసూళ్లు స్పీడప్‍ అందుకున్నాయి.