
- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍లో అంచనాలకు కౌన్సిల్ ఆమోదం
- సొంత ఆదాయం రూ.337 కోట్లు, గ్రాంట్లు రూ.728 కోట్లుగా లెక్కలు
- ఐదేండ్ల తర్వాత మరోసారి అతిపెద్ద బడ్జెట్
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍లో 2025–26 సంవత్సరానికిగానూ రూ.1,071.48 కోట్ల అంచనాలతో జంబో బడ్జెట్ రూపొందించారు. గురువారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ప్రవేశపెట్టిన బల్దియా ముసాయిదా బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. ఇందులో రూ.337.38 కోట్లు సాధారణ పన్నుల ద్వారా, రూ.728.10 కోట్లు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని లెక్క వేశారు. మరో రూ.600 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్స్‌ల రూపంలో వస్తాయని చెప్పారు. కౌన్సిల్ మీటింగ్‍లో రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కేఆర్.నాగరాజు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే పాల్గొన్నారు.
గ్రేటర్ ఉద్యోగుల జీతాలకు రూ.100 కోట్లు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాల కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు మేయర్ సుధారాణి తెలిపారు. శానిటేషన్ నిర్వహణకు రూ.29.92 కోట్లు, కరెంట్ బిల్లులకు రూ.34.30 కోట్లు, ఇంజినీరింగ్ విభాగానికి రూ.41.05 కోట్లు, సాధారణ నిర్వహణకు రూ.21.15 కోట్లు, టౌన్ ప్లానింగ్ కోసం రూ.1.40 కోట్లు, డిజాస్టర్ రెస్పాన్స్ కోసం రూ.1.50 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. విలీన గ్రామాల్లో అభివృద్ధి, సౌకర్యాలకు రూ.24.77 కోట్లు, పార్క్‌లు, ఓపెన్ జిమ్‍లు, వెండింగ్ జోన్లు, జంతు వధశాలల కోసం రూ.10.40 కోట్లు, డివిజన్లవారీగా అత్యవసర పనులకు రూ.39.15 కోట్లు కేటాయించామన్నారు.ఎన్నో ఏండ్లుగా పెండింగ్‍లో ఉన్న రూ.187 కోట్ల స్టాంప్ డ్యూటీ ఫండ్స్‌ను సీఎం రేవంత్‍రెడ్డి మంజూరు చేయడంతో ఈసారి బడ్జెట్ పెంచుకోడానికి అవకాశం కలిగిందని తెలిపారు.
పెట్టుబడులకు అవకాశం
గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్‍రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇప్పటికే మెగా టెక్స్టైల్ పార్క్, మామునూర్ ఎయిర్‍పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ, ఇన్నర్, ఔటర్ రింగ్‍రోడ్ల ప్రాజెక్టులు నడుస్తున్నాయని తెలిపారు. వీటితో వరంగల్ నగరానికి దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. రూ.1,071 కోట్లతో జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ ఆమోదించామని, ఖాళీ స్థలాలకు పన్ను విధించి, అక్రమ నిర్మాణాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటే బల్దియా ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి మాట్లాడుతూ.. విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‍రెడ్డి చొరవతో వరంగల్‌లో అభివృద్ధికి అడుగులు పడ్తున్నాయని పేర్కొన్నారు.
మూడో అతిపెద్ద బడ్జెట్
జీడబ్ల్యూఎంసీ ఏర్పాటు అనంతరం నాలుగుసార్లు రూ.1,000 కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మూడో అతిపెద్ద బడ్జెట్. గత బీఆర్‍ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 –18లో రూ.1,043 కోట్లు, 2018 –19 సంవత్సరానికి గానూ రూ.1,123.97 కోట్లు, 2019–20లో ఏకంగా రూ.1,431 కోట్లకు పెంచేశారు. ఈ అంచనాలు పేకమేడలా కూలడంతో.. 2020–21లో అప్పటి గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అనూహ్యంగా కేవలం రూ.305 కోట్లతో వాస్తవిక అంచనా బడ్జెట్‍కు పరిమితమయ్యారు. 2021–22లో గ్రేటర్ స్పెషల్ ఆఫీసర్‍గా నాటి అర్బన్ కలెక్టర్ రాజీవ్‍గాంధీ హనుమంతు రూ.557.77 కోట్లతో అంచనా బడ్జెట్ రూపొందించినా.. తర్వాత దాన్ని రూ.570.75 కోట్లకు సవరించారు. 2022–23 లో రూ.609.47 కోట్లు, 2023–24లో రూ.612.29 కోట్లు ఉండగా 2024–25 లో ముందుగా రూ.650.10 కోట్లు, తర్వాత సవరించి, రూ.776.20 కోట్లకు పెంచారు.