జైల్‍లో దోస్తానా.. బయటకొచ్చి డ్రగ్స్ దందా..గ్రేటర్‍ వరంగల్‍ పోలీసులకు పట్టుబడిన ముఠా

 జైల్‍లో దోస్తానా.. బయటకొచ్చి డ్రగ్స్ దందా..గ్రేటర్‍ వరంగల్‍ పోలీసులకు పట్టుబడిన ముఠా
  •  ముగ్గురు అరెస్ట్ ..  మరో ఏడుగురు పరార్
  • రూ.30 లక్షల విలువైన సరుకు స్వాధీనం 
  • వరంగల్‍ సెంట్రల్‍ జోన్‍ డీసీపీ షేక్‍ సలీమా వెల్లడి

వరంగల్‍, వెలుగు: సెంట్రల్‍ జైలు దోస్తానా.. బయటకొచ్చి డ్రగ్స్ దందా చేసే ముఠాలోని ముగ్గురిని వరంగల్‍  కమిషనరేట్‍ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ.30 లక్షల విలువైన గంజాయి, హాష్‍ ఆయిల్‍ను స్వాధీనం చేసుకున్నారు.  మంగళవారం వరంగల్‍ సెంట్రల్‍ జోన్‍ డీసీపీ షేక్‍ సలీమా మీడియాకు వివరాలు తెలిపారు.  హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన కోటగిరి సాయి వినయ్‍ 2023లో  ఫ్రెండ్ వరుణ్‍తో కలిసి ఏపీలోని మారేడుమిల్లి నుంచి గంజాయి తీసుకొస్తూ డొంకరాయి పోలీసులకు పట్టుబడగా.. రాజమండ్రి జైలుకు పంపించారు.

అక్కడ వీరికి ములుగు జిల్లాకు చెందిన లావుడ్యా రవీందర్‍ పరిచయం అయ్యాడు.  అంతకుముందే రవీందర్‍ హనుమకొండలో గణేష్‍ నిమజ్జనం సందర్భంగా అటెంప్ట్ మర్డర్ కేసులో ఖమ్మం సెంట్రల్‍ జైలుకు వెళ్లగా.. అక్కడ హరి, కబీర్‍ సింగ్‍ ఫ్రెండ్స్ అయ్యారు. వీరు బయటకు వచ్చాక గంజాయి, డ్రగ్స్ బిజినెస్‍ చేసేందుకు ప్లాన్ చేశారు. ముందుగా హరి, కబీర్‍ కలిసి రాజమండ్రి జైలులో రవీందర్‍కు ఫ్రెండ్ అయిన సాయి ఫోన్‍ నంబర్‍ తీసుకుని దందా మొదలుపెట్టారు.

అందరూ బయటకు వచ్చాక హరి తన అన్న రామ్మూర్తి నుంచి కిలో రూ.12 .50 లక్షల విలువైన హాష్‍ ఆయిల్‍ని కొని సాయి ఇంట్లో దాచారు. ఆ తర్వాత రవీందర్‍, హరిసింగ్‍ కలిసి 12 కిలోల ఎండు గంజాయిని కూడా అక్కడే పెట్టారు. ఇందులోంచి 2 కిలోలను కుశాల్‍, హరీశ్, వినోద్‍, జైసింహకు అమ్మారు. ఇదే తరహాలో హాష్‍ ఆయిల్‍ అమ్మేందుకు రెడీ అయ్యారు. స్టీల్‍ డబ్బాలో నింపి హైదరాబాద్‍ తీసుకెళ్లాలని ప్లాన్‍ చేశారు. రెడ్డికాలనీలో హనుమకొండ ఎస్ఐ పరుషరాములు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి నిందితులు పారిపోయేందుకు యత్నించగా..  పట్టుకుని విచారించగా డ్రగ్స్ దందా బయటపడింది.  

సాయి వినయ్‍, రవీందర్‍, హరిసింగ్‍ను అరెస్ట్ చేసినట్టు  హరి, కబీర్‍ సింగ్‍, రామ్మూర్తి, భూక్యా వినోద్‍, కుశాల్‍, హరీశ్, జైసింహ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుల వద్ద రూ. 25 లక్షల విలువైన 2 కిలోల హాష్‍ ఆయిల్‍, రూ.5 లక్షల విలువైన 2 కిలోల ఎండు గంజాయి, 3 సెల్‍ఫోన్లు, రాయల్‍ ఎన్‍ఫీల్డ్ బైక్‍, బజాజ్‍ ఆటో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసులో ప్రతిభ చూపిన హనుమకొండ పోలీసులతో పాటు వరంగల్‍ యాంటీ నార్కొటిక్స్  బ్యూరో  సిబ్బందిని డీసీపీ అభినందించారు.