- హస్తం పార్టీలో చేరిన మేయర్ గుండు సుధారాణి
- ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్న మెజార్టీ కార్పొరేటర్లు
- 66 మందిలో సుమారు 37 మంది కాంగ్రెస్ పార్టీలోనే..
- 53 నుంచి 22కు పడిపోయిన ‘గులాబీ’ కార్పొరేటర్ల సంఖ్య
- మేయర్ రాకపై మెజార్టీ కాంగ్రెస్కార్పొరేటర్ల వ్యతిరేకత
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గురువారం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‍లో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో గురువారం పార్టీ కండువా కప్పుకున్నారు. రెండు నెలల క్రితమే పార్టీలో చేరేందుకు సీఎం రేవంత్‍రెడ్డిని కలవగా, వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మెజార్టీ కార్పొరేటర్లు, సీనియర్ లీడర్లు అడ్డుపడడంతో చేరిక ఆగింది. కొద్దిరోజులుగా బీఆర్‍ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆమె కేటీఆర్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా పాల్గొనలేదు.
ఇది జరిగినా రెండు రోజులకే మేయర్ సుధారాణి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో గ్రేటర్ వరంగల్ పీఠం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేతికి వచ్చినట్లయింది. నాలుగైదు నెలలుగా గులాబీ పార్టీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‍లో చేరుతుండగా..గురువారం మేయర్ చేరికతో గ్రేటర్వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బలం పెరిగింది. మరోవైపు మేయర్ సుధారాణి తీరు నచ్చక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‍లో చేరిన కార్పొరేటర్లు గురువారం ప్రెస్మీట్ పెట్టి నిరసన వ్యక్తం చేశారు.
బీఆర్‍ఎస్ నుంచి 30 మంది కార్పొరేటర్లు జంప్
వరంగల్ మేయర్‍గా సుధారాణి 2021 మే 7న బాధ్యతలు స్వీకరించారు. బల్దియాలో మొత్తం 66 మంది కార్పొరేటర్లుండగా బీఆర్‍ఎస్ నుంచి 48 మంది, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఏఐఎఫ్‍బీ 1, ఇండిపెండెంట్లు 3 గెలిచారు. తర్వాత ముగ్గురు ఇండిపెండెంట్లు, మరో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లను బీఆర్ఎస్లో చేరారు. దీంతో మొన్నటి వరకు బీఆర్‍ఎస్ అత్యధికంగా 53 సీట్లతో బలంగా కనిపించింది.
కాంగ్రెస్ పార్టీ కేవలం నలుగురు కార్పొరేటర్లతో మూడో స్థానంలో ఉండగా..అసెంబ్లీ ఫలితాలు వచ్చిన నెలలోనే సీన్ మారింది. గ్రేటర్ పరిధిలో ఉండే వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో నాలుగైదు నెలల్లో వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, నాయిని రాజేందర్‍రెడ్డి ఆధ్వర్యంలో 26 నుంచి 28 మంది, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఆధ్వర్యంలో ఏడుగురు హస్తం గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 37 దాటింది. గులాబీ పార్టీ సంఖ్య 22కు అటుఇటుగా ఉంది. బీజేపీ నుంచి 10 మంది కార్పొరేటర్లు గెలిచినా ముగ్గురు పార్టీ మారడంతో వారికి ఏడుగురే మిగిలారు.
అవిశ్వాసానికి ముందే ‘చేతి’కి మేయర్ కుర్చీ
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠానికి రెండు సార్లు ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్పార్టీనే విజయం సాధించింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కార్పొరేటర్లంతా హస్తం పార్టీలోకి క్యూ కట్టారు. మే 6తో పాలకమండలి పదవీ కాలం మూడేండ్లు ముగుస్తున్న నేపథ్యంలో సుధారాణిపై అవిశ్వాసం పెట్టి మేయర్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావించారు. ఇందులో భాగంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, కొండా సురేఖ దంపతులు, కేఆర్.నాగరాజు గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ కార్పొరేటర్లను పార్టీ మారేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో 66 మందిలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. గుండు సుధారాణి చేరికతో మేయర్ పీఠం హస్తం ఖాతాలో పడ్డట్లయింది.
ఎవరొచ్చిన చేర్చుకుంటం: జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ను వీడిన నేతలను తిరిగి చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. గురువారం గాంధీ భవన్ లో వరంగల్ మేయర్ గుండు సుధారాణితో పాటు లీడర్లు కోటూరి మానవతారాయ్, ఈర్ల కొమరయ్య, మండల శ్రీరాములు కాంగ్రెస్‍లో చేరారు. మానవతారాయ్, ఈర్ల కొమరయ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడారు.
వీరికి కాంగ్రెస్ కండువా కప్పి జగ్గారెడ్డి, సీనియర్ నేత కోదండరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కూడా కాంగ్రెస్‍లో చేరారు. ఇంతకుముందు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉన్న సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు.
జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్టీని విడిచివెళ్లిన వారిని తిరిగి చేర్చుకుంటున్నామని, మరో రెండు రోజులు చేరికలు ఉంటాయన్నారు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళతో స్థానిక నాయకులకు కొంత ఇబ్బంది ఉంటుందన్నారు. తన సెగ్మెంట్లోనూ కొందరు తనకు వ్యతిరేకంగా పని చేశారని, వారిని పార్టీలో చేర్చుకోవాలంటే తనకు కూడా కొంత ఇబ్బంది ఉంటుందన్నారు. కానీ పార్టీ ఆదేశించినందున చేర్చుకుంటామన్నారు.