వరంగల్ లో రూ. లక్షలు పోసి రిపేర్ చేస్తున్నా సిగ్నళ్లు పని చేస్తలే..

వరంగల్ లో రూ. లక్షలు పోసి రిపేర్ చేస్తున్నా సిగ్నళ్లు పని చేస్తలే..
  • ఇటీవల రూ.40లక్షలతో రిపేర్ చేసినట్లు ఆఫీసర్ల లెక్కలు
  • స్మార్ట్ సిటీ ఫండ్స్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలు
  • జంక్షన్ల వద్ద తరచూ ప్రమాదాలు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ ​వరంగల్  లో ట్రాఫిక్​ నియంత్రణ కోసం జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన సిగ్నళ్లు తరచూ మొరాయిస్తున్నాయి. ఒకరోజు పనిచేస్తే.. నాలుగైదు రోజులు నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈక్రమంలో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. నగరంలోని ట్రాఫిక్​ సిగ్నళ్ల రిపేర్లకు జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు స్మార్ట్​ సిటీ ఫండ్స్​ నుంచి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, క్షేత్రస్థాయిలో సిగ్నళ్లు పనిచేయకపోవడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

13 జంక్షన్లు.. రూ.40 లక్షలు..
వరంగల్ సిటీ విద్య, వైద్యంతో పాటు వాణిజ్యపరంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతుండడంతో రోడ్లన్నీ రద్దీగా ఉంటున్నాయి. దీంతో ట్రాఫిక్​ నియంత్రణకు గ్రేటర్ పరిధిలో 13 చోట్ల సిగ్నల్స్​ ఏర్పాటు చేశారు. కాజీపేట, అదాలత్​, వడ్డేపల్లి, పెట్రోల్​ పంపు, కాకతీయ యూనివర్సిటీ జంక్షన్​, హనుమకొండ చౌరస్తా, ములుగురోడ్డు, ఎంజీఎం, పోచమ్మమైదాన్​, వెంకట్రామ జంక్షన్, వరంగల్ చౌరస్తా ఇలా తదితర జంక్షన్లలో  సిగ్నల్స్​ పెట్టారు. కానీ వాటి మెయింటెనెన్స్​ సరిగా లేకపోవడంతో తరచూ రిపేర్లకు గురవుతున్నాయి. గతేడాది గ్రేటర్​ వరంగల్ అభివృద్ధి కోసం కేటాయించిన స్మార్ట్​ సిటీ ఫండ్స్​ లో రూ.40 లక్షలు సిగ్నల్స్​ రిపేర్లకు కేటాయించారు. ఈ మేరకు టెండర్ ​నిర్వహించి రిపేర్లు కంప్లీట్​ చేశారు. ఆ తరువాత ఒకట్రెండు చోట్ల మినహా మిగతా జంక్షన్లలో మెయింటెనెన్స్​ లేక సిగ్నల్స్​ మళ్లీ మొరాయిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటోంది.

కోఆర్డినేషన్​ లేక ఇబ్బందులు..
జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు రూ.40 లక్షలతో సిగ్నల్స్​ రిపేర్లు చేయించగా.. అవి కొద్దిరోజులకే మళ్లీ కరాబ్ అయ్యాయి. అయితే వాటి మెయింటెనెన్స్​ను సంబంధిత కాంట్రాక్టరే చూసుకునేలా గ్రేటర్​ఆఫీసర్లే పర్యవేక్షించాల్సినప్పటికీ ఆ దిశగా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడైనా సిగ్నల్స్​ పనిచేయకపోతే ఆ పరిధిలోని పోలీసులు కూడా  గ్రేటర్​ ఆఫీసర్లకు సమాచారం అందించి  రిపేర్లు చేయించాలి. కానీ ఇక్కడ పోలీస్​ డిపార్ట్​మెంట్​, జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్ల మధ్య కోఆర్డినేషన్​ లేక సిగ్నల్స్​ రిపేర్లకు నోచుకోవడం లేదనే  ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే కొన్ని సందర్భాల్లో గ్రేటర్​ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినా రిపేర్లు చేయించడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటి వ్యక్తులతో పనిచేయించుకోవాల్సి వస్తోందని పోలీస్​ ఆఫీసర్లు చెబుతుండటం గమనార్హం.

జంక్షన్ల వద్ద ప్రమాదాలు
సిగ్నల్స్​ పని చేయకపోవడంతో ట్రాఫిక్​ పోలీసులు నిత్యం జంక్షన్​ మధ్యలోనే ఉండి డ్యూటీ చేయాల్సి వస్తోంది. అయినా ట్రాఫిక్​ కంట్రోల్​ తప్పి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల కింద కేయూ జంక్షన్​ వద్ద సిగ్నల్స్​ పనిచేయకపోవడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ట్రాఫిక్​ కానిస్టేబుల్​ సంకేతాలు ఇచ్చినప్పటికీ వాహనదారులు గందరగోళానికి గురి కాగా.. రెండు బైకులు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన గుర్రం నరేశ్, గుర్రం సాంబయ్య,  గుర్రం మొగిళి తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారులే కాదు.. రోడ్డు మధ్యలో నిలబడి డ్యూటీ చేస్తూ కొంతమంది ట్రాఫిక్​ కానిస్టేబుళ్లు కూడా ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలూ ఉన్నాయి. సిగ్నల్స్​ పనిచేయక నిత్యం ఏదో ఒక జంక్షన్​ వద్ద చిన్న చిన్న యాక్సిడెంట్లయినా జరుగుతున్నాయని ట్రాఫిక్​ సిబ్బంది చెబుతున్నారు. ఇకనైనా నగరంలోని ట్రాఫిక్​ సిగ్నల్స్​ మీద దృష్టి పెట్టి ప్రమాదాల నివారణకు యాక్షన్​ తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.