కొద్దిపాటి వానకే వరంగల్ ​కాలనీల్లో మురుగు పరుగు

కొద్దిపాటి వానకే వరంగల్ ​కాలనీల్లో మురుగు పరుగు
  • నాలాల్లో చెత్తాచెదారంతో వరద ప్రవాహానికి అడ్డంకులు
  • వాటర్ ఫ్లో     ఆగిపోవడంతో సమస్య
  • ఏటా డీసిల్టేషన్ పేరున రూ.లక్షలు ఖర్చు
  • శాశ్వత పరిష్కారం  చూపాలని ప్రజల డిమాండ్​ 

హనుమకొండ, వెలుగు: స్మార్ట్​సిటీగా చెప్పుకునే గ్రేటర్​వరంగల్ నగరం కొద్దిపాటి వానకే మురుగుమయంగా మారుతోంది. ఓ వైపు ఇరుకైన డ్రైన్లు, మరోవైపు నాలాల్లోనే కరెంట్​పోల్స్, వాటర్​పైపులైన్లతో ఇబ్బందులు తలెత్తుతుండగా..కాల్వల్లో పూడిక పేరుకుపోయి వరద ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పాటు కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయి వాటర్​ఫ్లోకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతుండగా.. కాల్వల్లోంచి మురుగునీరు బయటకు పోటెత్తుతోంది. దీంతో నగరంలోని రోడ్లు, కాలనీలు మురుగునీటితో నిండిపోతున్నాయి. అయితే కాల్వల్లో పూడిక తొలగించకపోవడం, ఇరుకు నాలాలను డెవలప్​ చేయకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతుండగా..ఏటా డీసిల్టేషన్​ పేరున రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.  

ఒక్క వానకే ఉప్పొంగుతున్న డ్రైన్లు

గ్రేటర్​వరంగల్ లో చాలాచోట్ల డ్రైన్లు ఇరుకుగా మారాయి. సిటీలో ప్రధాన నాలాలు 54 కిలోమీటర్లు, ఇంటర్నల్​ డ్రైనేజీ వ్యవస్థ 1,440 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వరద, డ్రైనేజీ వాటర్​ వెళ్లేందుకు దశాబ్ధాల కిందట నిర్మించిన కాల్వలు ప్రస్తుత అవసరాలు, వృథా నీటి ప్రవాహానికి అనుకూలంగా లేవు. ఇదిలాఉంటే చాలాచోట్ల కాల్వల్లోనే కరెంట్​ పోల్స్, నీటి సరఫరాకు సంబంధించిన పైపులు వేశారు. దీంతో కొద్దిపాటి వాన కురిసినా వాటర్​ఫ్లోకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అదే పైపులు, పోల్స్​కు చెత్తాచెదారం తట్టుకుని డ్రైన్లన్నీ మూసుకుపోతున్నాయి. ఫలితంగా వరద, మురుగునీళ్లన్నీ ఎటూదారి లేక కాల్వల పైనుంచి పారుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి చాలాచోట్ల కాల్వలు చెత్తతో నిండిపోయి వరద ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హనుమకొండ నడిమధ్యలో ఉన్న అలంకార్​జంక్షన్, ఉజిలిబేస్, కాపువాడ, న్యూరాయపుర ఏరియాలో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటంతో మురుగంతా సమీపంలోని రోడ్లతో పాటు కాలనీలను ముంచెత్తింది. దీంతో స్థానికులు బయటకు రావడానికే ఇబ్బందులు పడగా.. వాహనాల రాకపోకలకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో పాటు వరంగల్ శివనగర్, కాశీబుగ్గ, లేబర్​ కాలనీ, గాంధీ నగర్​, ఎల్​బీనగర్​, ఎస్ఆర్​నగర్, సాయిగణేశ్​కాలనీ, కుమార్​పల్లి మార్కెట్ తదితర ఏరియాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. హనుమకొండ తిరుమల బార్​ ఏరియా, అశోక కాలనీ, గోకుల్ నగర్​ఇలా చాలా చోట్ల స్లమ్​ ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి  కనిపించింది.  

పూడికతీతకు లక్షలు ఖర్చు

రెండేండ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలో నాలాలు, డ్రైన్లన్నీ ఉప్పొంగాయి. నాలాలను ఆక్రమించడం, శ్లాబులు వేయడంతో కాల్వల్లో పూడిక పేరుకుపోవడం వల్లే కాలనీలు నీట మునుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వ పెద్దలు, ఆఫీసర్లు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు చేపట్టి.. ఆ తర్వాత పూడిక తీతకు టెండర్లు నిర్వహించారు. ఈ మేరకు నిరుడు డీసిల్టేషన్​కోసం నగరంలో రూ.84 లక్షలతో ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పనులు పొందిన కాంట్రాక్టర్లు నయీంనగర్​, బొందివాగు నాలాల్లో పూడిక తీసి, మిగతా డ్రైన్లలో  నామమాత్రంగా సిల్ట్ తొలగించి వదిలేశారు. దీంతో చాలావరకు కాల్వల్లో పూడిక అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే కుమార్​పల్లి మార్కెట్​ఏరియాతో పాటు అంబేడ్కర్​భవన్​ సమీపంలో తరచూ మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వాస్తవానికి డీ సిల్టేషన్​పనుల్లో భాగంగా నాలాల్లో వరద నీటి ప్రవాహానికి ఏర్పడే అడ్డంకులను తొలగించడంతో పాటు గుర్రపుడెక్క, చెత్తాచెదారం తొలగించాల్సి ఉంది. కానీ నిరుడు అదంతా ఏమీ చేయకుండా ఫండ్స్​ఖాళీ చేశారనే ఆరోపణలున్నాయి. కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీరు ముంచెత్తిన సమయాల్లో  లీడర్లు, ఆఫీసర్లు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి.

ప్రతిసారి తిప్పలే..

నగరంలో వరద, మురుగునీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏటా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి నిర్మిస్తున్న అండర్​ గ్రౌండ్​డ్రైనేజీల పనులు కొనసాగుతుండగా..ఇంటర్నల్​ డ్రైన్స్​ను పెద్దగా పట్టించుకోవడం లేదు. నగరంలో ఒక మీటర్​కంటే తక్కువ వెడల్పున్న కాల్వలు 318 ఉండగా..వాటిని మున్సిపల్ అండ్​పబ్లిక్​ హెల్త్​డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో క్లీన్​చేయిస్తుంటారు. కానీ చాలాచోట్ల శ్లాబులు వేసి ఉండటంతో నామమాత్రంగా చేసి వదిలేస్తున్నారు. జేసీబీలు, హిటాచీలతో క్లీన్​చేయించే కాల్వలు 29 ఉండగా.. వానాకాలం వస్తే తప్ప డీసిల్టేషన్​ చేయించడం లేదు. దీంతోనే కొద్దిపాటి వానలు పడినా వరద ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇకనైనా గ్రేటర్​ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు నాలాల పూడికతీత, రిపేర్లు చేపట్టి వరద ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్​చేస్తున్నారు. 

ఏటా ఇవే తిప్పలు

సిటీలో చాలాచోట్ల మురుగుకాల్వలు ఇరుకుగా మారాయి. వర్షాలు పడినప్పుడల్లా కాల్వలు పొంగుతున్నాయి. చెత్తాచెదారం తట్టుకుని వరద, మురుగునీళ్లన్నీ కాలనీల్లోకి వస్తున్నాయి. రోడ్లపై కనీసం నడవలేని పరిస్థితి ఉంటోంది. లీడర్లు, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా తేలిగ్గా తీసుకుని వదిలేస్తున్నారు. 
- కృష్ణమాచారి, అలంకార్​ 

వరద నీటితో ఇబ్బంది పడుతున్నం

వర్షాలు పడినప్పుడల్లా కాలనీల్లోకి వరద నీరు, మురుగునీళ్లు వస్తున్నాయి. కాల్వల్లో చెత్తాచెదారం, పూడిక పేరుకుపోవడం వల్ల మాకు కష్టాలు తప్పడం లేదు. హనుమకొండలోని గోకుల్​నగర్​, అశోకకాలనీ తదితర ఏరియాల్లో తరచూ ఇదే సమస్య తలెత్తుతోంది. లీడర్లు, ఆఫీసర్లు చొరవ తీసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. 
- మధు, అశోక కాలనీ