కరోనా ప్రభావం తర్వాత కోలుకుంటున్న దేశాలు వైరస్ నియంత్రణ కోసం కఠిన ఆంక్షలు పెడుతున్నాయి. ఇప్పటి వరకు యువతకు, మధ్య వయస్కుల వారికి వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించాయి. కానీ గ్రీస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి వృద్ధులకు కూడా టీకా కంపల్సరీ అని ఆదేశాలు జారీ చేసింది.
60 ఏళ్లు పైబడిన వారు టీకా వేసుకోకుంటే నెలవారీగా ఫైన్ వసూలు చేస్తామంటూ హెచ్చరించారు గ్రీక్ ప్రధాని కైరకోస్. 2022, జనవరి 16 లోగా వ్యాక్సిన్ వేయించుకోవాలని లేకపోతే నెలకు 114 డాలర్లు (భారత కరెన్సీలో సుమారుగా రూ.8,545) జరిమానా కట్టాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ నిర్ణయం కాస్త కఠినంగా అనిపించినా.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఫాలో అవ్వాల్సిందేనని కైరకోస్ స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలో పరిస్థితిపై నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధాని తీసుకున్న తాజా నిర్ణయం మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుండటం గమనార్హం.