
- ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తం: సీఎం రేవంత్
- రేడియల్ రోడ్లతో ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌ను అనుసంధానిస్తం
- వాటికి ఇరువైపులా ఇండస్ట్రియల్క్లస్టర్స్ను ఏర్పాటు చేస్తం
- మెగా డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేసి ఏపీలోని సీ పోర్ట్‌కు కనెక్ట్ చేస్తం
- ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడ్తున్నం
- బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం
హైదరాబాద్, వెలుగు:కోర్ సిటీకి అవతల ఔటర్‌రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్‌రోడ్(ట్రిపుల్ఆర్) వరకు మాన్యుఫాక్చరింగ్హబ్ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఉండబోతున్నదని చెప్పారు. ఈ మాన్యుఫాక్చరింగ్హబ్ చైనా ప్లస్‌వన్ అవస రాలు తీర్చేలా ఉంటుందని వెల్లడించారు.
ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్లను రేడియల్రోడ్లతో అనుసంధానించి..వాటికి ఇరువైపులా ఇండస్ట్రియల్క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మెగా డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేసి..ఏపీలోని సీ పోర్టుకు అనుసంధానిస్తామని, ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, ఆర్ అండ్ డీ, మాన్యుఫ్యాక్చరింగ్, నైపుణ్యాల కేంద్రంగా ముందుకు వెళ్తామని చెప్పారు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన గ్రీన్ ఫార్మా సిటీని వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే అతిపెద్ద ఫార్మా కంపెనీలు అందులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాయని సీఎం రేవంత్రెడ్డి వివరించారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ మధ్య ఫార్మా విలేజ్‌లు అభివృద్ధి చేస్తున్నామని,5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్ రాజధానిగా బయో ఏషియా సదస్సు నిలబెట్టిందని పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా దేశ విదేశాలకు చెందిన ఫార్మా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.
ఉన్నత విద్యపై ఫోకస్
రీసెర్చ్, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ ఉన్నత విద్యపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందని, ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, వివిధ రంగాల్లో నిపుణులు, ఇంజినీర్లను తయారు చేసి.. జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ జీనోమ్ వ్యాలీలో ఇటీవలే జర్మనీకి చెందిన మిల్టెన్యీ బయోటెక్ అనే సంస్థ సెల్, జన్యు చికిత్స సంస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు. ‘‘రాబోయే పదేండ్లలో రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో సేవల రంగానికి ప్రాధాన్యమిస్తాం. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. ఇప్పుడు ఈవీలకు హైదరాబాద్‌ను రాజధానిగా చేశాం. దేశంలోనే అత్యధిక ఈవీల అమ్మకాలు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. త్వరలోనే ఆర్టీసీలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నాం’’ అని వివరించారు.
పెట్టుబడులకు ప్రోత్సాహం
దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడంతోపాటు.. అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయని చెప్పారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్రం ఎన్నడూ లేనంతగా రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిందని గుర్తు చేశారు. వాటితో వివిధ రంగాల్లో 50 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. నిరుడు లైఫ్‌సైన్సెస్ రంగంలో 150 కిపైగా ప్రాజెక్టుల్లో రూ.40 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని అనుకూలతలను అవకాశంగా మలచుకొని, ప్రభుత్వ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందిగా కంపెనీల ప్రముఖులకు ఆయన పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మౌలిక వసతుల కల్పన, ఆశించినంత మద్దతునిచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత 25 ఏండ్లలో హైదరాబాద్ ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ పవర్‌హౌస్‌గా అవతరించిందని చెప్పారు. కాగా, సింగపూర్‌కు చెందిన ప్రొఫెసర్ పాట్రిక్ టాన్‌కు బయో ఏషియా వేదికగా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును సీఎం రేవంత్ ప్రదానం చేశారు.
లైఫ్ సైన్సెస్ వర్సిటీ ఏర్పాటు చేస్తం: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంబంధిత పరిశ్రమలను ఇందులో భాగం చేస్తున్నామని, తద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచస్థాయి నిపుణులను తయారు చేయాలన్న లక్ష్యంతో కోర్సులకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించి ప్రపంచ పటంలో తెలంగాణ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిందని అన్నారు. రెండు దశాబ్దాల కిందటే మొదలైన ఈ ప్రయాణం స్ఫూర్తితో తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని చెప్పారు. లైఫ్సైన్సెస్లో తెలంగాణను నంబర్ వన్‌గా నిలపడంలో జీనోమ్ వ్యాలీది కీలక పాత్ర అని అన్నారు. హార్ట్ ఆఫ్ ది లైఫ్‌సైన్సెస్ అయిన జీనోమ్ వ్యాలీని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోనే ఆగిపోబోమని, సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. యూనివర్సిటీలు, స్టార్టప్, ఆర్ అండ్ డీ సంస్థలను భాగం అయ్యేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. కొత్త ఆలోచనలకు అండగా ఉంటామన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి లైఫ్‌సైన్సెస్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏఐ, క్వాంటం, రోబోటిక్స్ తదితర నూతన టెక్నాలజీల సాయంతో రోగుల అవసరాలకు తగ్గట్టుగా వారికి త్వరగా సాంత్వన చేకూరేలా ఔషధాల సామర్థ్యాన్ని పెంచే పరిశోధనలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు. పెట్టుబడులకు సంబంధించి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ, బ్రిటన్‌కు చెందిన ఎన్ హెచ్‌ఎస్‌లు టీహబ్‌తో ఎంవోయూ చేసుకున్నాయని తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్(సీఆర్డీఎంవో) హెడ్ ఆఫీసును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నదని వెల్లడించారు.